31,170 ఫోన్‌ నంబర్లతో హెల్ప్‌లైన్‌ మోసాలు! 

25 Feb, 2023 04:33 IST|Sakshi

కస్టమర్‌ కేర్‌ సెంటర్లుగా మోసపూరిత కార్యకలాపాలు

సైబర్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ క్లౌడ్‌సెక్‌ నివేదిక 

న్యూఢిల్లీ: కస్టమర్‌ కేర్‌ హెల్ప్‌లైన్‌లుగా పేర్కొంటూ, మోసపూరిత కార్యకలాపాలకు తెగబడుతున్న 31,179 ఫోన్‌ నెంబర్లను గుర్తించినట్లు  సైబర్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ క్లౌడ్‌సెక్‌ శుక్రవారం తెలిపింది. ఈ  నంబర్లను విశ్లేషించి, వాటిలో 56 శాతం అంటే 17,285 భారతీయ ఫోన్‌ నంబర్లు కాగా, మిగిలినవి నాన్‌–ఇండియన్‌ నెంబర్లుగా గుర్తించినట్లు పేర్కొంది. ‘‘క్లౌడ్‌సెక్‌ భారతదేశంలో విస్తృతమైన స్కామ్‌ను డీకోడ్‌ చేసింది.

ఇందులో వినియోగదారులను మోసం చేయడానికి నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్‌లను ఉపయోగించడం జరుగుతోంది. ఈ స్కామ్‌లో ప్రముఖ బ్రాండ్‌ల కోసం నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్‌లను సృష్టించి వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయడం, సహాయం కోసం ఈ నంబర్‌లకు కాల్‌ చేయడానికి సందేహించని వినియోగదారులను మోసగించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయి’’ అని  కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  

ప్రచారం ఇలా... : భారత దేశ ఫోన్‌ నంబర్లగా గుర్తించిన వాటిలో 80 శాతం ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నాయని,  అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయని  గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. 88 శాతం నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్‌లు ఫేస్‌బుక్‌ పోస్ట్‌లు, ప్రొఫై ల్స్, పేజ్‌ ద్వారా ప్రచారంలో ఉన్నట్లు తమ విశ్లేషణలో తేలినట్లు వివరించింది.  దాదాపు ఆరు శాతం మంది ట్విట్టర్‌ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. 2 శాతం మంది సులేఖ, గూగుల్‌ను తమ ఫోన్‌ నెంబర్‌లను ప్రచారం చేయడానికి వినియోగిస్తున్నారు. 

బ్యాంకింగ్, ఫైనాన్స్‌పై తొలి గురి... 
మోసాలకు ఎంచుకుంటున్న రంగాల్లో మొదటి వరుసలో బ్యాంకింగ్, ఫైనాన్స్‌ సెక్టార్‌ (59.4 శాతం) ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా హెల్త్‌కేర్‌ (19.2 శాతం), టెలికమ్యూనికేషన్స్‌ (10.5 శాతం) ఉన్నాయి. 23 శాతం నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లు నమోదయిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో పశ్చిమ  బెంగాల్‌ ఉంది.  అక్రమ కార్యకలాపాలకు కోల్‌కతాకు ప్రధాన కేంద్రంగా ఉంది. 9.3 శాతం చొప్పున వరుసగా ఢిల్లీ,  ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి.   

మరిన్ని వార్తలు