రేయ్‌! ఏం చేస్తున్నార్రా బాబూ!! వైఫై ఫ్రీగా ఇస్తే ?

8 Jun, 2022 13:12 IST|Sakshi

ఇంటర్నెట్‌తో ప్రపంచమే కుగ్రామం అయిపోయింది. జీవితంలో ప్రతీ పనిలో ఇంటర్నెట్‌ దూరిపోయింది. టికెట్‌ కొనుగోలు మొదలు ప్రయాణం ముగిసే వరకు ఫోన్లకే అతుక్కుపోతున్నారు జనాలు. మారిన అవసరాల దృష్ట్యా రైల్వేశాఖ సైతం ముఖ్యమైన స్టేషన్లలో 30 నిమిషాల పాటు ఫ్రీగా వైఫై సర్వీసులు రైల్‌టెల్‌ పేరుతో  అందిస్తోంది. ఇలా ఫ్రీగా వచ్చే వైఫై కూడా పాడు పనులకు వినియోగిస్తున్నట్టు తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలతో జాతీయ మీడియాలో కథనాలు సైతం వచ్చాయి.

యూజ్‌ఫుల్‌గా ఉంటుందని
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 30 స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉంది. ప్రయాణానికి ముందు స్టేషన్‌కి వచ్చిన వారు తాము ప్రయాణించే రైలు వివరాలు, లైవ్‌ స్టేటస్‌, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, టికెట్‌ బుకింగ్‌ తదితర వివరాలు తెలుసుకునేందుకు, ముఖ్యమైన రీఛార్జ్‌లు చేసుకునేందుకు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో వీటిని ఈ సర్వీసులు అందిస్తున్నారు. కొంత మందికి కాలక్షేపం అవుతుందని అధికారులు భావించారు.

స్పీడ్‌ తక్కువంటూ
రైల్వేస్టేషన్లలో వైఫై సర్వీసులు ఆశించిన స్థాయిలో లేవని ముఖ్యంగా నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉందంటూ తరచుగా రైల్వేకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఫ్రీ వైఫై వినియోగం తీరును సంబంధించిన డేటాను రైల్‌టెల్‌ ఇటీవల విశ్లేషించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. తామొకటి తలిస్తే యూజర్‌ మరొకటి తలుస్తున్నాడనే చేదు నిజం రైల్వేకు అవగతం అయ్యింది. డేటా విశ్లేషణలో వెల్లడైన వాస్తవాలు రైల్వే అధికారులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా మారింది.

ఏకంగా 35 శాతం
రైల్వేశాఖ అంచనాలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నట్టు తాజా వివరాలు చెబుతున్నాయి. ఫ్రీ వైఫైని ఎక్కువ మంది అశ్లీల కంటెంట్‌ చూడటానికి, డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వినియోగిస్తున్నట్టు రైల్‌టెల్‌ తెలిపింది. ఆశ్లీల కంటెంట్‌కు ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోవడంతో కేవలం ఫ్రీగా అందించే 30 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 350 ఎంబీ డేటాను ఖర్చు చేసేస్తున్నారు. ఇలాంటి వారు ఏకకాలంలో పెరిగిపోవడంతో లోడ్‌ ఎక్కువైపోతున్నట్టు గుర్తించారు. ఫ్రీ వైఫై ట్రాఫిక్‌లో అశ్లీల కంటెంట్‌ వాటా ఏకంగా 35 శాతం ఉన్నట్టుగా తేలింది.

బ్లాక్‌లిస్టులో
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు వెల్లడించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో  సికింద్రాబాద్‌, విజయవాడ, తిరుపతి స్టేషన్లలోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని పేర్కొంది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ పరధిలో బూతు వీడియోలు రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్‌ అవుతున్నట్టు తేలింది. రైల్‌టెల్‌ అందిస్తున్న ఫ్రీ డేటా పథకం ఎలా పక్కదారి పట్టిందో తెలియడంతో... ఈ బూతుకు అడ్డుకట్ట వేసేందుకు అనేక సైట్లను బ్లాక్‌లిస్టులో పెడుతున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. స్టేషన్లలో బూతు భాగోతానికి తెరదించేందుకు మరింత పకబ్బంధీ ప్రణాళిక రూపొందించే పనిలో ఉంది రైల్వేశాఖ. 

చదవండి: సోషల్‌ మీడియా పైత్యం.. ‘బైకాట్‌ ఖతర్‌ ఎయిర్‌వేస్‌’..

మరిన్ని వార్తలు