Freedom 251 Mohit Goel: అప్పుడు స్మార్ట్‌ఫోన్లు.. ఇప్పుడేమో 200 కోట్ల స్కాం!!

26 Aug, 2021 07:50 IST|Sakshi

నాలుగేళ్ల క్రితం డెడ్‌ చీప్‌గా స్మార్ట్‌ఫోన్‌ అందిస్తానంటూ ప్రకటన చేసిన మోహిత్‌ గోయల్‌ గుర్తున్నాడా? దేశం మొత్తం కుదిపేసిన ‘ఫ్రీడం 251 ఫోన్‌’ స్కాం ప్రధాన నిందితుడైన ఈ మోహిత్‌ను ఇప్పుడు పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. ఓ వ్యక్తిని 41 లక్షలకు ముంచడంతో పాటు చంపేందుకు ప్రయత్నించిన నేరారోపణలపై గ్రేటర్‌ నోయిడా పోలీసులు మోహిత్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. 

గోయల్‌తో పాటు మరో ఐదుగురిపైనా 41 లక్షల రూపాయలకు సంబంధించిన లావాదేవీల మోసంపై ఇందిరాపురం చెందిన వికాస్‌ మిట్టల్‌ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం గ్రేటర్‌ నోయిడాలోని గోయోల్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రై ఫ్రూట్స్‌ అమ్మకాలకు సంబంధించిన వ్యహారంలో మోసం చేయడమే కాకుండా.. డబ్బుల గురించి నిలదీస్తే చంపేస్తానని వికాస్‌ను చెదిరించాడు గోయల్‌. అంతేకాదు కారుతో ఢీ కొట్టి చంపేందుకు ప్రయత్నించాడని వికాస్‌ ఆరోపిస్తున్నాడు. దీంతో వికాస్‌ ఫిర్యాదు మేరకు మోహిత్‌ గోయల్‌ను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. 

మోసం, దోపిడీ, చంపేస్తానని బెదిరించడం, గాయపర్చడం.. ఇలా పలు నేరాలకుగానూ ఐపీసీ సెక్షన్లతో మోహిత్‌పై కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే 2017లో రింగింగ్‌ బెల్‌ అనే కంపెనీ ద్వారా ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల అమ్మకం ప్రకటన ద్వారా సంచలనానికి తెరలేపిన మోహిత్‌.. భారీ స్కామ్‌తో వార్తల్లోకి ఎక్కి అరెస్టైన విషయం తెలిసిందే. ఆపై దుబాయ్‌ డ్రై ఫఫ్రూట్స్‌ అండ్‌ స్పైసిస్‌ పేరుతో ఓ ఆఫీస్‌ తెరిచి.. సుమారు 200 కోట్ల స్కాంకు పాల్పడ్డాడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ డ్రై ఫ్రూట్స్‌ వ్యవహారంలో పలు రాష్ట్రాల నుంచి అతనిపై 35 కేసులు నమోదు అయ్యాయి.

చదవండి: సిండికేట్‌ బ్యాంక్‌లో మోసం కేసులో సీబీఐ చార్జ్‌షీట్‌

మరిన్ని వార్తలు