‘ఆహార’ బిల్లుల్లో లైసెన్స్‌ నంబరు తప్పనిసరి

11 Jun, 2021 03:37 IST|Sakshi

అక్టోబర్‌ నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: ఆహార వ్యాపార సంస్థలు ఇకపై తమ ఇన్‌వాయిస్‌లు, బిల్లుల్లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు నంబరు లేదా రిజిస్ట్రేషన్‌ నంబరును తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 2 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట సమాచారం లేకపోవడం వల్ల చాలా మటుకు ఫిర్యాదులు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. తాజా పరిణామంతో నిర్దిష్ట ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంఖ్యతో ఆహార వ్యాపార సంస్థపై వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడానికి వీలవుతుందని తెలిపింది. ‘‘లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్‌ అధికారులు ఈ విషయానికి విస్తృతంగా ప్రచారం కల్పించాలి.

అక్టోబర్‌ 2 నుంచి కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి’’ అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. ఆహార వ్యాపార వ్యవస్థ చాలా భారీగా ఉంటుందని, ఆపరేటర్లకు కేటాయించే 14 అంకెల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నంబరు అంత సులభంగా కనిపించకపోవచ్చని, అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది. ఫలితంగా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలంటే వినియోగదారుకు చాలా కష్టసాధ్యంగా ఉంటుందని పేర్కొంది. నియంత్రణ సంస్థలు సైతం సదరు ఫిర్యాదు మూలాలను గుర్తించి, సత్వరం పరిష్కరించడానికి సాధ్యపడటం లేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. ప్రస్తుతం ప్యాకేజ్డ్‌ ఆహార ఉత్ప్తతులపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నంబరును తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటున్నప్పటికీ.. రెస్టారెంట్లు, మిఠాయి షాపులు, కేటరర్లు, రిటైల్‌ స్టోర్స్‌ వంటివి పాటించడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు