మిషన్‌ ‘ఆయిల్‌ పామ్‌’.. సబ్సిడీ తీరు ఇలా..

20 Aug, 2021 11:21 IST|Sakshi

స్వయం సమృద్ధి దిశగా కేంద్రం చర్యలు

దిగుమతుల్లో 57 శాతం పామాయిలే

సాగు, ఉత్పత్తిలో దేశంలో నంబర్‌ వన్‌ ఏపీ  

సాక్షి, అమరావతి: పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా పామాయిల్‌ సాగును జాతీయ వంట నూనెల మిషన్‌ (ఎన్‌ఎంఈవో)లో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. వంట నూనెల దిగుమతిని తగ్గించడం, ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా ఆయా పంటలు, ఉత్పత్తిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఆహార ధాన్యాలైన వరి, గోధుమ, పంచదారలో మనదేశం స్వయం సమృద్ధి సాధించి ఎగుమతి దిశగా సాగుతుండగా వంటనూనెల్ని మాత్రం పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితిని నివారించేలా ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. 

దిగుమతుల్లో 56 శాతం పామాయిలే...
మనదేశం ఏటా సుమారు 133.5 లక్షల టన్నుల వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటుండగా దీని విలువ సుమారు రూ.80 వేల కోట్లు ఉంటుంది. దిగుమతి చేసుకునే నూనెల్లో 57 శాతం పామాయిల్‌ కాగా 27 శాతం సోయా, 16 శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఉంది. ఒక్క పామాయిల్‌పైనే కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయిల్‌ పామ్‌ తోటల విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఆంధ్రప్రదేశ్‌ తదితర చోట్ల ఆయిల్‌ పామ్‌ సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుత 3.28 లక్షల హెక్టార్లలో సాగులో ఉండగా 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు, 2029–30 నాటికి 16.7 లక్షల హెక్టార్లకు పెంచాలని నిర్దేశించారు. నూనె దిగుబడిని 3.15 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు.

ప్రభుత్వ సాయం ఎలా ఉంటుందంటే...
సాగు విస్తరణలో భాగంగా జాతీయ ఆహార భద్రత మిషన్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం–ఓపీ) కింద మొక్కలకు 85 శాతం సబ్సిడీని ఉద్యాన శాఖ ఇస్తుంది. నాణ్యమైన మొక్కల్ని అందజేస్తుంది. తోటల నిర్వహణ, అంతర పంటలు, గొట్టపుబావులు, పంపు సెట్లు, వర్మీ కంపోస్ట్‌ యూనిట్లు, మెషినరీ, ఇతర పరికరాలకు 50 శాతం సాయం అందిస్తుంది. తోటల సాగుపై రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తుంది. రైతులకు లాభసాటిగా ఉండేలా ధరల ఫార్ములాను నిర్ణయిస్తుంది.

ఏటా రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే..
వంట నూనెల దిగుమతులపై కేంద్రానికి ఏటా పన్నుల రూపంలో రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆయిల్‌ పామ్‌ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.5 వేల కోట్లను వెచ్చిస్తే సత్ఫలితాలు కనిపిస్తాయని, రైతులు కూడా పెద్దఎత్తున ఆసక్తి చూపుతారని ఆయిల్‌ పామ్‌ రైతుల జాతీయ సంఘం నేతలు క్రాంతి కుమార్‌ రెడ్డి, బి.రాఘవరావు పేర్కొన్నారు.

దేశంలో నంబర్‌ వన్‌ ఏపీ..
ఆయిల్‌ పామ్‌ సాగు, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ప్రస్తుతం 1.62 లక్షల హెక్టార్లలో 1.14 లక్షల మంది రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. సాలీనా హెక్టార్‌కు 19.81 టన్నుల ఆయిల్‌ దిగుబడి వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తూనే పామాయిల్‌ రైతులను ఆదుకునేలా పలు చర్యలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రంలో సాగు పెరుగుతోంది. 9 జిల్లాల్లో 229 మండలాలలో ఈ పంట సాగవుతోంది.

మరిన్ని వార్తలు