ఐపీవోకి మెడ్‌ప్లస్‌ డిసెంబర్‌ 13 నుంచి ప్రారంభం

8 Dec, 2021 08:42 IST|Sakshi

ఐపీవోకి మెడ్‌ప్లస్‌, మెట్రోబ్రాండ్స్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫార్మసీ రిటైల్‌ దిగ్గజం మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ డిసెంబర్‌ 13న ప్రారంభమై 15న ముగుస్తుంది. ఇందుకు సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 780–796గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా మెడ్‌ప్లస్‌ దాదాపు రూ. 1,398 కోట్లు సమీకరించనుంది. కనీసం 18 షేర్లకు బిడ్‌ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల కోసం రూ. 5 కోట్ల విలువ చేసే షేర్లను కేటాయించారు. సిబ్బందికి తుది ధరపై షేరు ఒక్కింటికి రూ. 78 డిస్కౌంటు లభిస్తుంది. ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ప్రమోటరు, ప్రస్తుత వాటాదారులు రూ. 798.30 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌ పరిమాణాన్ని రూ. 1,039 కోట్ల నుంచి తగ్గించారు. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను అనుబంధ సంస్థ ఆప్టివల్‌ నిర్వహణ మూలధన అవసరాల కోసం ఉపయోగించుకోనున్నారు. గంగాడి మధుకర్‌ రెడ్డి 2006లో మెడ్‌ప్లస్‌ను ప్రారంభించారు. ఔషధాలు, వైద్య పరికరాలు, టెస్ట్‌ కిట్లతో పాటు ఇతరత్రా ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను కూడా మెడ్‌ప్లస్‌ స్టోర్స్‌ విక్రయిస్తాయి. 

ఢిల్లీ, కేరళ మార్కెట్లపైనా దృష్టి .. 
ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 2,000 పైచిలుకు స్టోర్స్‌ ఉన్నాయని వర్చువల్‌ మీడియా సమావేశంలో కంపెనీ ఎండీ, సీఈవో మధుకర్‌ రెడ్డి వివరించారు. ఢిల్లీ, కేరళ మార్కెట్లలోకి కూడా ప్రవేశించే యోచన ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గతేడాది కోవిడ్‌–19పరమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ 350 స్టోర్స్‌ ఏర్పాటు చేశామని మధుకర్‌ రెడ్డి తెలిపారు. ప్రైవేట్‌ లేబుల్‌ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో ప్రైవేట్‌ లేబుల్స్‌ వాటా సుమారు 11.98 శాతంగా ఉందని పేర్కొన్నారు.  

మెట్రో బ్రాండ్స్‌ ఐపీవో 
న్యూఢిల్లీ: ఫుట్‌వేర్‌ రిటైలర్‌ మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ శుక్రవారం(10న) మొదలుకానుంది. మంగళవారం(14న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 485–500కాగా.. తద్వారా రూ. 1,368 కోట్లు సమీకరించాలని కంపెనీ ఆశిస్తోంది. సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలాకు పెట్టుబడులున్న మెట్రో బ్రాండ్స్‌ గురువారం(9న) యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా రూ. 295 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా ప్రమోటర్లు దాదాపు 10 శాతం వాటాను ఆఫర్‌ చేయనున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 84 శాతంగా నమోదైంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధులలో కొంతమేర మెట్రో, మోచీ, వాకెవే, క్రాక్స్‌ బ్రాండ్లతో కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. 
 

>
మరిన్ని వార్తలు