ఎయిరిండియా, విస్తారా విలీనానికి అనుమతులపై కసరత్తు

28 Feb, 2023 01:24 IST|Sakshi

న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీనంపై టాటా గ్రూప్‌ కసరత్తు కొనసాగిస్తోంది. ప్రస్తుతం కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) నుంచి అనుమతులు తీసుకునే ప్రక్రియ జరుగుతోందని ఎయిరిండియా చీఫ్‌ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తెలిపారు. ఎయిరిండియాకు అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యం ఉన్న నేపథ్యంలో విలీనానంతరం ఏర్పడే సంస్థ అదే పేరుతో కొనసాగుతుందని ఆయన వివరించారు. అయితే, ’విస్తార’ వారసత్వంగా కొన్ని అంశాలను యథాతథంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని విల్సన్‌ చెప్పారు.

‘గ్రూప్‌లో ఒక ఫుల్‌–సర్వీస్‌ ఎయిర్‌లైన్, ఒక చౌక సర్వీసుల విమానయాన సంస్థ ఉండాలన్నది మా ఉద్దేశం. ఎయిరిండియా, విస్తార విలీనంతో ఫుల్‌ సర్వీస్‌ ఎయిర్‌లైన్‌ ఏర్పాటవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియాను టాటా గ్రూప్‌ గతేడాది టేకోవర్‌ చేసింది. అందులో విస్తారను, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ను (గతంలో ఎయిరేషియా ఇండియా) విలీనం చేయాలని భావిస్తోంది. ఎయిరిండియా, విస్తార విలీనం 2024 మార్చి నాటికి పూర్తి కావచ్చని అంచనా. ప్రస్తుతం విస్తారలో టాటా గ్రూప్‌నకు 51 శాతం, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు