Fund Review : రిస్క్‌ తట్టుకుంటే రాబడులు

23 Aug, 2021 08:56 IST|Sakshi

డీఎస్‌పీ ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌ రివ్యూ

మోస్తరు రిస్క్‌ భరించే వారు ఫ్లెక్సీక్యాప్‌ విభాగంలోని పథకాలను పెట్టుబడులకు పరిగణనలోకి తీసుకోవచ్చు. మార్కెట్‌ క్యాప్‌ పరంగా అనువైన అవకాశాలున్న చోటు పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఉన్నవే ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌. గతేడాది సెబీ కొత్తగా ఈ విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో డీఎస్‌పీ ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌ మంచి పనితీరును చూపిస్తోంది. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్, స్మాల్‌క్యాప్‌లతో అధిక రాబడులు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేసుకోవాలనుకునే వారు తమ పోర్ట్‌ఫోలియోలో ఈ పథకాన్ని భాగం చేసుకోవచ్చు. గతంలో ఈ పథకం మల్టీక్యాప్‌ పేరుతో కొనసాగడం గమనార్హం. 
పెట్టుబడుల విధానం 
పేరులో ఉన్నట్టుగానే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లో ఆకర్షణీయైమన పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. ఒక విభాగంలో వ్యాల్యూషన్స్‌ ఖరీదుగా మారిన సందర్భాల్లో పెట్టుబడుల కేటాయింపులు తగ్గించుకుని, ఆకర్షణీయంగా ఉన్న ఇతర విభాగాల్లోని అవకాశాలపై ఇన్వెస్ట్‌ చేయడాన్ని గమనించొచ్చు. నాణ్యమైన, సత్తా ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుని, ఎక్కువ కాలం పాటు కొనసాగడాన్ని అనుసరిస్తుంది. మార్కెట్‌ కరెక్షన్లలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటుంది. లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ కేటాయింపులు చేయడం ద్వారా 2008, 2011, 2015 మారెŠక్‌ట్‌ పతనాల్లో నష్టాలు పరిమితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అదే సమయంలో మార్కెట్‌ ర్యాలీల్లోనూ మెరుగైన ప్రదర్శనే చేసింది. 2017 బుల్‌ మార్కెట్‌లో ఈ పథకం పనితీరే ఇందుకు నిదర్శనం. 2020 మార్చి మార్కెట్‌ పతనం సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులు 93 శాతంగానే ఉన్నాయి. మార్కెట్ల విలువలు గరిష్టాలకు చేరాయన్న జాగ్రత్తతో నగదు నిల్వలను పెంచుకుంది. మే వరకు చూసిన తర్వాత క్రమంగా ఈక్విటీల్లో పెట్టుబడులను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. దీంతో సూచీలతో పోలిస్తే మెరుగైన పనితీరు ఈ పథకం నమోదు చేసింది. రోలింగ్‌ రాబడులను గమనించినట్టయితే ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో ఎప్పుడూ కూడా ఈ పథకంలో ప్రతికూల రాబడులు (నష్టాలు) లేకపోవడం ముఖ్యంగా గమనించాలి. మార్కెట్‌ పతనాలు, ర్యాలీల్లో మెరుగైన ప్రదర్శన చూపించిందని చెప్పడానికి నిదర్శనంగా.. డౌన్‌సైడ్‌ క్యాప్చర్‌ రేషియో 93గా, అప్‌సైడ్‌ క్యాప్చర్‌ రేషియో 103గా ఉన్నాయి. 

రాబడులు 
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో సుమారు రూ.6,000 కోట్ల పెట్టుబడులున్నాయి. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 55 శాతంగా ఉన్నాయి. ఐదేళ్లలో 16 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 15.5 శాతం చొప్పన వార్షిక రాబడులను ఇచ్చింది. ఫ్లెక్సీక్యాప్‌ విభాగంతో పోలిస్తే రెండు శాతం వరకు అధిక రాబడులను ఈ పథకంలో చూడొచ్చు. మొత్తం పెట్టుబడుల్లో 99 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయగా, మిగిలిన ఒక శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 62 స్టాక్స్‌ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 64 శాతం పైగా పెట్టుబడులు కలిగి ఉండగా.. మిడ్‌క్యాప్‌లో 27 శాతం, స్మాల్‌క్యాప్‌లో 8 శాతానికి పైనే పెట్టుబడులు నిర్వహిస్తోంది. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. 32 శాతం కేటాయింపులు ఈ రంగంలోని కంపెనీలకే 

ఈక్విటీ టాప్‌ హోల్డింగ్స్‌ 
కంపెనీ                               పెట్టుబడుల కేటాయింపులు
ఐసీఐసీఐ బ్యాంకు                 8.26 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు            6.02 
ఇన్ఫోసిస్‌                              4.12 
అల్ట్రాటెక్‌సిమెంట్‌                 3.79 
బజాజ్‌ ఫైనాన్స్‌                      3.27 
బజాజ్‌ ఫిన్‌సర్వ్‌                     3.16 
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌           3.07 
గుజరాత్‌ గ్యాస్‌                       2.93 
యాక్సిస్‌ బ్యాంకు                   2.78 
మదర్సన్‌ సుమీ                      2.34   
 

చదవండి: రిటైర్‌మెంట్‌ తర్వాత స్థిర ఆదాయం కోసం ఇలా చేయండి

మరిన్ని వార్తలు