ఫార్మాలో పెట్టుబడుల కోసం.. నిప్పన్‌ ఇండియా ఫార్మా ఫండ్‌

21 Feb, 2022 08:25 IST|Sakshi

ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఫార్మాను ‘సురక్షిత’ రంగంగా చూస్తుంటారు. వినియోగం పరంగా ఫార్మా రంగంలో ఎప్పటికీ వృద్ధి ఉంటుంది. 10–20 ఏళ్ల క్రితంతో పోల్చి చూస్తే నేడు ప్రతి ఇంటికి ఆరోగ్యం, ఔషధ బడ్జెట్‌ పెరిగిపోయింది. ఈ రంగానికి ఎంత భవిష్యత్తు ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన మూడేళ్లలో ఫార్మా స్టాక్స్‌ మంచి లాభాలను ఇచ్చాయి. దీర్ఘకాలం కోసం ఫార్మాలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునేవారు థీమ్యాటిక్‌ (ఒకే రంగంలో ఇన్వెస్ట్‌ చేసేవి) ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నిప్పన్‌ ఇండియా ఫార్మా ఫండ్‌ పనితీరు దీర్ఘకాలానికి నికలడగా ఉందని చెప్పుకోవాలి. 

5 నుంచి 10 ఏళ్లు
ఫార్మా రంగంలో స్వల్పకాలం కోసం పెట్టుబడులు అనుకూలం కాదు. ఎందుకంటే ఇవి నియంత్రణల మధ్య పనిచేస్తుంటాయి. ముఖ్యంగా యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీల ప్రభావం స్టాక్స్‌పై ఉంటుంది. దీర్ఘకాలంలో అయితే ఈ తరహా అస్థిరతల దశ నుంచి కంపెనీలు బయటకు వస్తుంటాయి. తాత్కాలిక ఒడిదుడుకులు ఈ రంగంలో సాధారణం. కనుక దీర్ఘకాలం కోసమే (5–10 ఏళ్లు) సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు.  

పనితీరు...
నిప్పన్‌ ఇండియా ఫార్మా ఫండ్‌ 2011–16 మధ్య కాలంలో బీఎస్‌ఈ హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌తో పోటీపడి మరీ రాబడులను ఇచ్చింది. ఆ కాలంలో వార్షికంగా 23.8 శాతం చొప్పున రాబడిని అందించింది. అదే కాలంలో బీఎస్‌ఈ హెల్త్‌కేర్‌ రాబడి 24.3 శాతం చొప్పున ఉండడం గమనించాలి. కానీ, 2016–19 మధ్య కాలంలో బీఎస్‌ఈ హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ కంటే నిప్పన్‌ ఇండియా ఫార్మా ఫండ్‌ అధిక రాబడిని అందించింది. కరోనా తర్వాత చూస్తే వార్షిక రాబడి 31.9 శాతంగా ఉంది. కానీ, బీఎస్‌ఈ హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 26.9 శాతం రాబడినే ఇచ్చింది. ఈ పథకం ట్రైలింగ్‌ రాబడులను పరిశీలిస్తే.. గడిచిన ఏడాది కాలంలో 11.47 శాతం, మూడేళ్లలో 24 శాతం, ఐదేళ్లలో 16 శాతం, ఏడేళ్లలో 11.56 శాతం, 10 ఏళ్లలో 17.61 శాతం చొప్పున ఉన్నాయి. ఈ పథకం 2004 జూన్‌ 5న ప్రారంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడి 20.72 శాతంగా ఉంది. 

పోర్ట్‌ఫోలియో/పెట్టుబడుల విధానం 
ప్రస్తుతానికి ఈ పథకం నిర్వహణలో రూ.4,910 కోట్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు (ఏయూఎం) ఉన్నాయి. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ ఫార్మా స్టాక్స్, హాస్పిటల్స్, హెల్త్‌కేర్‌ కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. జనవరి నాటికి చూస్తే సన్‌ ఫార్మాకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చింది. అమెరికాలో జనరిక్‌ ధరల ఒత్తిళ్ల ప్రభావం సన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ పోర్ట్‌ఫోలియోపై పడదు కనుక ఈ పథకం ఎక్కువ కేటాయింపులు చేసి ఉండొచ్చు. టాప్‌–5 కంపెనీల్లో సిప్లా, దివిస్‌ ల్యాబ్స్, డాక్టర్‌ రెడ్డీస్‌కు గణనీయ కేటాయింపులు చేసింది. 22 శాతం మేర హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. హెల్త్‌కేర్‌ సేవలు మరింత విస్తరించే కొద్దీ ఈ కంపెనీల వ్యాపార అవకాశాలు విస్తృతం అవుతాయి. ఈ పథకం బహుళజాతి ఫార్మా కంపెనీలకు తక్కువ కేటాయింపులు చేస్తుంటుంది. ప్రస్తుతానికి కేటాయింపులు 9 శాతం మేర ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 24 స్టాక్స్‌ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు 47 శాతం, మిడ్‌క్యాప్‌ కంపెనీలకు 43 శాతం స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు 10 శాతం చొప్పున కేటాయించింది. 

గమనిక: సెక్టార్స్‌ ఫండ్స్‌/థీమ్యాటిక్‌ ఫండ్స్‌ అన్నవి అధిక రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. ఎందుకంటే వైవిధ్యానికి పెద్దగా అవకాశం ఉండదు. సంబంధిత రంగంలోనే పెట్టుబడులు మొత్తం పెట్టడం వల్ల ప్రతికూలతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని ప్రత్యేకమైన కాలాల్లో ప్రతికూల రాబడులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం కోసమే ఎంపిక ఉండాలి. అది కూడా మీ మొత్తం పెట్టుబడుల్లో 10 శాతాన్ని మించకుండా చూసుకోవాలి.  

చదవండి: Mutual Fund Review: హెచ్‌డీఎఫ్‌సీ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌ తీరు తెన్నులు

మరిన్ని వార్తలు