స్టార్టప్‌లకు ఫండింగ్‌ బూస్ట్‌

14 Apr, 2022 06:31 IST|Sakshi

క్యూ1లో 10.8 బిలియన్‌ డాలర్లు

కొత్తగా 14 యూనికార్న్‌ ఆవిర్భావం

ఒక్క సాస్‌ విభాగంలోనే 5 సంస్థలు

మొత్తం యూనికార్న్‌ల సంఖ్య 84కు

ముంబై: దేశీ స్టార్టప్‌ వ్యవస్థలోకి నిధుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రస్తుత క్యాలండర్‌ ఏడాది(2022) తొలి మూడు నెలల్లోనే ఏకంగా 14 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. వెరసి వరుసగా మూడో క్వార్టర్‌లోనూ యూనికార్న్‌ల స్పీడ్‌ కొనసాగింది. పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక ప్రకారం 334 లావాదేవీల ద్వారా 10 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 75,000 కోట్లు) తాజా పెట్టుబడులు లభించాయి. బిలియన్‌ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. కాగా.. మార్చిచివరికల్లా దేశీయంగా వీటి సంఖ్య 84ను తాకింది. ఒక త్రైమాసికంలో 10 బిలియన్‌ డాలర్ల నిధులు దేశీ స్టార్టప్‌ వ్యవస్థలోకి ప్రవహించడం వరుసగా ఇది మూడోసారికావడం విశేషం! వెరసి ఈ క్యూ1(జనవరి–మార్చి)లో స్టార్లప్‌లు మొత్తం 10.8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి.  

సాస్‌ హవా
నివేదిక ప్రకారం సాఫ్ట్‌వేర్‌నే సర్వీసులుగా అందించే(సాస్‌) కంపెనీలు అత్యధికంగా పెట్టుబడులను అందుకున్నాయి. 3.5 బిలియన్‌ డాలర్లకు మించిన నిధులు ప్రవహించాయి. దీంతో క్యూ1లో ఐదు యూనికార్న్‌లు సాస్‌ విభాగంనుంచే ఆవిర్భవించాయి. ప్రపంచ ఆర్థిక వాతావరణం అనిశ్చితిగా ఉన్నప్పటికీ దేశీ స్టార్టప్‌ వ్యవస్థ పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు కన్సల్టెన్సీ స్టార్టప్స్‌ విభాగం చీఫ్‌ అమిత్‌ నాకా పేర్కొన్నారు. వృద్ధికి పెట్టుబడులు అవసరమైన స్థాయిలో నిధులు లభించడం ప్రస్తావించదగ్గ అంశమని తెలియజేశారు.  

సుపరిపాలన
దేశీయంగా స్టార్టప్‌లు భారీ వృద్ధిని అందుకుంటున్న నేపథ్యంలో కార్పొరేట్‌ సుపరిపాలనకు ప్రాధాన్యత పెరుగుతున్నట్లు అమిత్‌ పేర్కొన్నారు. దీంతో స్టార్టప్‌లకు కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై మార్గదర్శకాల రూపకల్పనపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. వ్యవస్థాగతంగా విస్తరణపై ఆశలున్న కంపెనీలు ఇందుకు తగిన విధంగా సన్నద్ధంకావలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సాస్‌ ఎకోసిస్టమ్‌లోకి గత మూడేళ్లలోనే మూడు రెట్లు అధిక పెట్టుబడులు తరలిరాగా.. కరోనా మహమ్మారి ఇందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహాన్నిచ్చినట్లు వివరించారు. మారుమూల ప్రాంతాల నుంచీ పనిచేసే పరిస్థితులతోపాటు, ఉత్పాదకత పెరగడం, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ప్రాధాన్యత ఇందుకు సహకరిస్తున్నాయి.   

15 సంస్థలు
సాస్‌ విభాగంలో గత మూడేళ్ల కాలంలో 15 యూనికార్న్‌లు పుట్టుకొచ్చాయి. ఈ జాబితాలో డార్విన్‌బాక్స్, ఫ్రాక్టల్, యూనిఫోర్, హసురా, అమగీ మీడియా ల్యాబ్స్‌ తదితరాలున్నాయి. 2021 చివర్లో ఫ్రెష్‌వర్క్స్‌ నాస్‌డాక్‌లో బంపర్‌ లిస్టింగ్‌ను సాధించడంతో సాస్‌ సంస్థలకు కొత్త జోష్‌ వచ్చినట్లు అమిత్‌ ప్రస్తావించారు. పలు కంపెనీలు పబ్లిక్‌ లిస్టింగ్‌పై దృష్టిపెడుతున్నట్లు పేర్కొన్నారు.

విలీనాలు..
దేశీ స్టార్టప్‌ వ్యవస్థలో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్‌ఏ) లావాదేవీలు క్యూ1లో ఈకామర్స్‌ విభాగంలో అధికంగా జరిగాయి. క్యూర్‌ఫుడ్స్, మెన్సా బ్రాండ్స్, గ్లోబల్‌బీస్, మైగ్లామ్‌ ఎంఅండ్‌ఏలో భాగమయ్యాయి. వీటి కీలక వ్యాపార వ్యూహాలకు ప్రాధాన్యత లభించగా.. అప్‌స్కాలియో, ఈవెన్‌ఫ్లో తదితర కంపెనీలు సైతం రేసులో చేరాయి. 38 శాతం ఎంఅండ్‌ఏలు ఈకామర్స్, డైరెక్ట్‌టు కన్జూమర్‌ విభాగంలో నమోదుకాగా.. 22 శాతం డీల్స్‌కు  సాస్‌ రంగంలో తెరలేచింది. వృద్ధి, చివరి దశ స్టార్టప్‌లు విలువరీత్యా 89 శాతం పెట్టుబడులు అందుకోగా.. మొత్తం లావాదేవీల్లో 44 శాతం వాటాను ఆక్రమించాయి. గత మూడు త్రైమాసికాలలో వృద్ధిస్థాయి నిధులు 6.5–7 బిలియన్‌ డాలర్లకు చేరగా.. సగటు టికెట్‌ పరిమాణం 5.5–7 కోట్ల డాలర్లుగా నమోదైంది. తొలి దశ పెట్టుబడుల విషయానికివస్తే 4 మిలియన్‌ డాలర్ల సగటు టికెట్‌ పరిమాణంలో 76.1 కోట్ల డాలర్లు లభించాయి. లావాదేవీల పరిమాణంలో ఇవి 55 శాతంగా నివేదిక తెలియజేసింది.

మరిన్ని వార్తలు