స్టార్టప్స్‌లోకి భారీగా తగ్గిన పెట్టుబడులు.. ఎంత శాతం అంటే!

19 Jul, 2022 07:17 IST|Sakshi

న్యూఢిల్లీ: మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్‌ నెలకొన్న నేపథ్యంలో ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో అంకుర సంస్థల్లోకి పెట్టుబడులు తగ్గాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 17 శాతం క్షీణించి 6 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 47,800 కోట్లు) పరిమితమయ్యాయి. పీజీఏ ల్యాబ్స్‌తో కలిసి ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

 ‘ఈ క్యాలెండర్‌ సంవత్సరం (2022) రెండో త్రైమాసికంలో 16 భారీ డీల్స్‌ కుదిరాయి. వీటి ద్వారా 6 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. ఈ వ్యవధిలో కొత్తగా 4 యూనికార్న్‌ సంస్థలు (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌ గలవి) ఏర్పడ్డాయి. దీనితో ప్రథమార్ధంలో మొత్తం యూనికార్న్‌ల సంఖ్య 20కి చేరింది. వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 26 శాతం భాగం ఫిన్‌టెక్‌ విభాగం దక్కించుకుంది’ అని నివేదిక వివరించింది.

 క్రెడ్, డైలీహంట్‌ వంటి సంస్థల్లోకి భారీగా నిధులు రావడంతో ఫిన్‌టెక్, మీడియా.. వినోద రంగాల్లోకి వచ్చే పెట్టుబడుల పరిమాణం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. క్యూ2లో వచ్చిన పెట్టుబడుల్లో ఈ విభాగాలు 45 శాతం వాటా దక్కించుకున్నాయని తెలిపింది. మొత్తం ఫండింగ్‌లో 58 శాతం పెట్టుబడులు .. వృద్ధి దశలో ఉన్న సంస్థల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఒక నిర్దిష్ట స్థాయికి చేరిన స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపినట్లు నివేదిక వివరించింది.   

మరిన్ని వార్తలు