రూ.24,713 కోట్ల ఒప్పందం.. ఫ్యూచర్ గ్రూప్‌‌ మరో అడుగు 

22 Mar, 2021 01:47 IST|Sakshi

ఢిల్లీ హైకోర్ట్‌ ఏకసభ్య ధర్మాసనం తీర్పుపై డివిజనల్‌ బెంచ్‌కి అప్పీల్‌

అమెజాన్‌తో వివాదంలో మలుపు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు తన రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారం అమ్మకానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందంపై గ్లోబల్‌ ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌తో కిషోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ రిటైల్‌ న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ ఒప్పందంపై ముందుకు వెళ్లకుండా తనను తీవ్రస్థాయిలో నియంత్రిస్తూ, గురువారం నాడు (2021 మార్చి 18) జేఆర్‌ మిథా నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన 134 పేజీల తీర్పును డివిజనల్‌ బెంచ్‌ వద్ద అప్పీల్‌ చేసినట్లు ఫ్యూచర్‌ రిటైల్‌ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  

డివిజనల్‌ బెంచ్‌ క్రితం మధ్యంతర స్టే ఉత్తర్వులు వెకేట్‌ కాలేదు... 
ఫ్యూచర్‌ రిటైల్‌ శుక్రవారం నాడు  ఒక కీలక ప్రకటన చేస్తూ, ఈ కేసుకు సంబంధించి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముందు జరుగుతున్న విచారణపై సింగిల్‌ జడ్జి తీర్పు ఎటువంటి ప్రభావాన్ని చూపబోదని స్పష్టం చేసింది. రిలయన్స్‌తో ఫ్యూచర్‌ రిటైల్‌ గ్రూప్‌ ఒప్పంద అమలు విషయంలో ఎన్‌సీఎల్‌టీ ఇప్పటికే తన ఉత్తర్వులను రిజర్వ్‌ చేసిన విషయాన్ని ఆ ప్రకటనలో ఫ్యూచర్‌ ప్రస్తావించింది. ఈ అంశానికి సంబంధించి 2021 ఫిబ్రవరి 22న సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను ఫ్యూచర్స్‌ ఈ సందర్భంగా ప్రస్తావించింది. రిలయన్స్‌తో ఫ్యూచర్స్‌ ఒప్పందంపై ఎన్‌సీఎల్‌టీ ప్రొసీడింగ్స్‌ యధావిధిగా కొనసాగవచ్చని, అయితే తుది ఉత్తర్వులు మాత్రం ఇవ్వడానికి లేదని 2021 ఫిబ్రవరి 22న సుప్రీంకోర్టు తన రూలింగ్‌లో స్పష్టం చేసిన విషయాన్ని కిషోర్‌ బియానీ నేతృత్వంలోని సంస్థ ప్రస్తావించింది.

అదే విధంగా సింగిల్‌ జడ్జి ఇప్పుడు ఇచ్చిన తీర్పులో కొన్ని, కీలక ప్రధాన అంశాలు 2021 ఫిబ్రవరి 2వ తేదీన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో (ఒప్పందంపై ముందుకు వెళ్లవద్దని ఫ్యూచర్‌ను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు) కూడా ఉన్నాయని ఫూచర్స్‌ ప్రస్తావిస్తూ, దీనిపై తాము వేసిన అప్పీల్‌కు చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పాటిల్, జస్టిస్‌ జ్యోతి సింగ్‌లతో కూడిన  డివిజనల్‌ బెంచ్‌ 2021 ఫిబ్రవరి 8న సానుకూలమైన రూలింగ్‌ ఇస్తూ,  సిం గిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. దీనిపై అమెజాన్‌ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ, సింగిల్‌ జడ్జి (2021 ఫిబ్రవరి 2న ఇచ్చిన) మధ్యంతర ఉత్తర్వులపై డివిజనల్‌ బెంచ్‌ ఇచ్చిన స్టే ఉత్తర్వులను  అత్యున్నత న్యాయస్థానం ‘వెకేట్‌’ చేయలేదన్నది కీలకమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ ‘స్టే’  ఆదేశాలు ఇప్పటికీ అమల్లోనే ఉన్నట్లు భావించాలని తమకు న్యాయ నిపుణులు సూచనలు ఇస్తున్నట్లు తెలిపింది.  

వివరాలు ఇలా..: ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్‌ కూపన్స్‌ (ఎఫ్‌సీపీఎల్‌)లో అమెజాన్‌ కొంత వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటాలు ఉన్నందున.. అమెజాన్‌ కూడా పరోక్షంగా అందులోను స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్‌ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్‌ రిటైల్‌ వ్యాపారాన్ని దాదాపు రూ. 24,713 కోట్లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి (ఆర్‌ఐఎల్‌) విక్రయించేందుకు ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌కు అనుమతుల కోసం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్‌..  తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్‌ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్‌ఆర్‌ఎల్‌.. ఢిల్లీ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ని ఆశ్రయించింది. అమెజాన్‌తో ఎఫ్‌సీపీఎల్‌ ఒప్పంద నిబంధనలు, ఆర్‌ఐఎల్‌–ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఒప్పంద నిబంధనలు వేరువేరని, డీల్‌ విషయంలో ముందుకెళ్లొచ్చంటూ సింగిల్‌ జడ్జి ఆదేశాలపై స్టే విధిస్తూ డివిజనల్‌ బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపైనే అమెజాన్‌ .. సుప్రీంను ఆశ్రయించింది. ఈ లోపు ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌ను కట్టడిచేస్తూ, 2021 మార్చి 18న కీలక ఆదేశాలు ఇచ్చింది.  

మరిన్ని వార్తలు