అమెజాన్‌ అభ్యంతరాలు సరికాదు.. మరోసారి సుప్రీం కోర్టును కోరిన ఎఫ్‌ఆర్‌ఎల్‌

28 Aug, 2021 17:07 IST|Sakshi

ఆస్తులు అమ్ముకునేందుకు ఫ్యూచర్‌ గ్రూప్‌ అధినేత కిశోర్‌ బియానీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న చట్టపరమైన చిక్కులు తొలగించుకునేందుకు వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా మరోసారి దేశంలోని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

డీల్‌కు అనుమతి ఇవ్వండి
ఫ్యూచర్‌, రిలయన్స్‌ గ్రూపుల మధ్య కుదిరిన రూ. 24,731 కోట్ల డీల్‌ అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఫ్యూచర్‌ గ్రూపు మరోసారి ఆశ్రయించింది. ఈ ఒప్పందం ఆలస్యం అవడం వల్ల సంస్థలో పని చేసే 35 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని పేర్కొంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. గతంలో ఇలాంటి కేసుల్లో వచ్చిన తీర్పులను ఉదహరిస్తూ తమ డీల్‌పై అమెజాన్‌ లేవనెత్తుతున్న అభ్యంతరాలను కొట్టి వేయాలని ఫ్యూచర్‌ గ్రూప్‌ కోరింది. మొత్తం ఆరు వేల పేజీలతో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కోరింది. 

వివాదానికి నేపథ్యం ఇది
ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) అమెజాన్‌కి వాటాలు ఉన్నాయి. దీని ప్రకారం  ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా అమెజాన్‌కి దఖలు పడ్డాయి. అయితే అమెజాన్‌ని సంప్రదించకుండా తమ రిటైల్‌ తదితర వ్యాపారాలను రిలయన్స్‌ రిటైల్‌కు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నట్టు 2020 ఆగస్టులో ఫ్యూచర్‌ గ్రూప్‌ ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌నకు లీగల్‌ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్‌ గ్రూప్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు సైతం ఢిల్లీ కోర్టు తీర్పును సమర్థించింది. 

చదవండి : Elon Musk: ‘బెజోస్‌ దావాలు వేయడానికే తప్పుకున్నాడేమో! హహహా..’

మరిన్ని వార్తలు