ఫ‍్యూచర్‌ గ్రూప్ ఫ్యూచర్‌‌.. కత్తిమీద సాము!

13 Nov, 2020 14:02 IST|Sakshi

అమెజాన్‌ గ్రూప్‌తో న్యాయ వివాదాలు

కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఆరోపణలు

ఫ్యూచర్‌ గ్రూప్‌పై ఆర్బిట్రేటర్‌కు అమెజాన్‌ ఫిర్యాదు

ఆర్‌ఐఎల్‌తో డీల్‌ రద్దయితే ఫ్యూచర్‌ గ్రూప్‌ దివాళా?

నేడు ఫ్యూచర్‌ రిటైల్‌ క్యూ2(జులై- సెప్టెంబర్‌) ఫలితాలు

ముంబై: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌)కు రిటైల్‌ బిజినెస్‌ల విక్రయం ప్రస్తుతానికి డోలాయమానంలో పడటంతో ఫ్యూచర్‌ గ్రూప్‌ దిక్కుతోచని పరిస్థితికి చేరినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రిటైల్ బిజినెస్‌లను ఆర్‌ఐఎల్‌కు విక్రయించేందుకు ఫ్యూచర్‌ గ్రూప్‌ 3.4 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్‌ కుదర్చుకోవడంలో ఫ్యూచర్‌ గ్రూప్‌ నిబంధనలు ఉల్లంఘించిందంటూ అమెజాన్‌ గ్రూప్‌ సింగపూర్‌ ఆర్బిట్రేటర్‌ కోర్టును ఆశ్రయించింది. దీంతో తాత్కాలికంగా డీల్‌ను నిలిపివేయమంటూ సింగపూర్‌ ఆర్బిట్రేటర్‌ అక్టోబర్‌లో ఫ్యూచర్‌ గ్రూప్‌ను ఆదేశించిన విషయం విదితమే. చదవండి: (చిన్న షేర్ల దన్ను- స్మాల్‌ క్యాప్‌ రికార్డ్‌)

ఏం జరిగిందంటే..
గతేడాది ఫ్యూచర్‌ గ్రూప్‌లోని అన్‌లిస్టెడ్‌ కంపెనీలలో 49 శాతం వాటాను యూఎస్‌ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌ కొనుగోలు చేసింది. తద్వారా గ్రూప్‌లోని ప్రధాన లిస్టెడ్‌ కంపెనీ ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా కొనుగోలుకి తమకు హక్కు ఉన్నదంటూ వాదిస్తోంది. అయితే నిబంధనలకు అనుగుణంగానే ఆర్‌ఐఎల్‌తో డీల్‌ కుదుర్చుకున్నట్లు ఫ్యూచర్‌ గ్రూప్‌ వాదిస్తోంది. రుణభారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్‌ గ్రూప్‌ మార్చిలో లాక్‌డవున్‌ల విధింపు నేపథ్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీంతో రిటైల్‌ ఆస్తుల విక్రయానికి ఆర్‌ఐఎల్‌తో డీల్‌ కుదుర్చుకుంది. చదవండి: (ఐషర్ మోటార్స్‌‌- ఐబీ రియల్టీ.. హైజంప్‌)

ఆకర్షణీయ మార్కెట్
దేశీయంగా ట్రిలియన్‌ డాలర్ల విలువైన కన్జూమర్‌ రిటైల్‌ మార్కెట్‌లో పాగా వేసేందుకు ఇప్పటికే అమెజాన్‌, ఆర్‌ఐఎల్‌, వాల్‌మార్ట్‌(ఫ్లిప్‌కార్ట్‌) తదితర దిగ్గజాలు పావులు కదుపుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ బిజినెస్‌ కొనుగోలుకి రిలయన్స్‌ గ్రూప్‌ ఆసక్తి చూపింది. తద్వారా రిలయన్స్‌ రిటైల్‌ బిజినెస్‌కు బూస్ట్‌ లభించే వీలుంటుందని భావించింది. అయితే దేశీ రిటైల్‌ మార్కెట్లో భారీ వాటాపై కన్నేసిన అమెజాన్‌ గ్రూప్‌.. ఈ డీల్‌ నిబంధనలకు విరుద్ధమంటూ ఫ్యూచర్‌ గ్రూప్‌నకు వ్యతిరేకంగా సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టుకు ఫిర్యాదు చేసింది. తద్వారా అక్టోబర్‌ 25న డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేయమంటూ ఆర్బిట్రేటర్‌ కోర్టు నుంచి ఎమర్జెన్సీ ఆదేశాలను సాధించింది. ఈ అంశంపై దేశీయంగా కాంపిటీషన్‌ కమిషన్‌ను సైతం ఆశ్రయించింది. నిజానికి అమెజాన్‌ మే నెలలో ఫ్యూచర్‌ గ్రూప్‌లో మరింత వాటా కొనుగోలుకి ఆసక్తి చూపి విఫలమైనట్లు వార్తలు వెలువడ్డాయి.

డీల్‌పై ఆశలు
అమెజాన్‌తో తలెత్తిన న్యాయవివాదాలను స్థానిక చట్టాల ద్వారా పరిష్కరించుకునే యోచనలో ఉన్నట్లు ఫ్యూచర్‌ గ్రూప్‌ ఇప్పటికే పేర్కొంది. ఆర్‌ఐఎల్‌ సైతం వీలైనంత త్వరగా ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ ఆస్తుల కొనుగోలును చేపట్టే వీలున్నట్లు సంకేతాలిచ్చింది. అమెజాన్‌తో అన్‌లిస్టెడ్‌ గ్రూప్‌ సంస్థల కాంట్రాక్టుకు రిటైల్‌ ఆస్తుల విక్రయానికి సంబంధంలేదంటూ ఫ్యూచర్‌ గ్రూప్‌ న్యాయనిపుణులు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు సంస్థలూ ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమేనని, ఒకే యాజమాన్య నిర్వహణలో ఉన్నాయని అమెజాన్‌ న్యాయనిపుణులు పేర్కొంటున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. కాగా.. ఆర్‌ఐఎల్‌తో డీల్‌ విఫలమైతే ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెల్లింపుల సమస్యలు ఎదురుకాగలవని, పలువురు ఉపాధి కోల్పోయే ప్రమాదమున్నదని మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ఫ్యూచర్‌ గ్రూప్‌ రుణ చెల్లింపుల సమస్యలు ఎదుర్కొన్నట్లు ప్రస్తావిస్తున్నారు. కోవిడ్‌-19 ప్రభావం, ప్రత్యర్ధుల నుంచి తీవ్ర పోటీ తదితర ప్రతికూలతలతో అమ్మకాలు పడిపోగా.. వరుసగా రెండు త్రైమాసికాలలో ఫ్యూచర్‌ గ్రూప్‌ భారీ నష్టాలను నమోదు చేసింది. దీంతో గ్రూప్‌లోని షేర్లు 80 శాతం వరకూ పతనమయ్యాయి. కాగా.. నేడు ఫ్యూచర్‌ రిటైల్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక(జులై- సెప్టెంబర్‌) ఫలితాలను ప్రకటించనుండటం గమనార్హం!

మరిన్ని వార్తలు