ఫ్యూచర్‌ గ్రూప్‌ స్టాక్స్‌- అమెజాన్‌ షాక్‌

26 Oct, 2020 12:02 IST|Sakshi

కిశోర్‌ బియానీ గ్రూప్‌నకు ఆర్బిట్రేజ్‌ చెక్

‌ఆర్‌ఐఎల్‌తో డీల్‌ నిలుపుదలకు ఆదేశాలు

5 శాతం పతనమైన ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు

2 శాతం క్షీణించిన ఆర్‌ఐఎల్‌ కౌంటర్‌

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌)తో కుదుర్చుకున్న డీల్‌ను ప్రస్తుతానికి నిలిపివేయవలసిందిగా ఫ్యూచర్‌ గ్రూప్‌ను సింగపూర్‌ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌(ఎస్‌ఐఏసీ) ఆదేశించడంతో ఈ గ్రూప్‌లోని షేర్లు అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. దాదాపు ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లన్నీ 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు సైతం 2 శాతం వెనకడుగుతో రూ. 2,072 దిగువన ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 2,065 వరకూ క్షీణించింది. 

పతన బాటలో
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 91 వద్ద నిలవగా.. ఫ్యూచర్‌ రిటైల్‌ తొలుత 9 శాతం పతనమై రూ. 71.20 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది.ప్రస్తుతం 2.6 శాతం నీరసించి రూ. 76 దిగువన ట్రేడవుతోంది. ఈ బాటలో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 5 శాతం కోల్పోయి రూ. 9.50 వద్ద, ఫ్యూచర్‌ మార్కెట్‌ నెట్‌వర్క్స్‌ 5 శాతం పతనమై రూ. 15.20 వద్ద ఫ్రీజయ్యాయి. ఇదే విధంగా ఫ్యూచర్‌ కన్జూమర్‌ 5 శాతం క్షీణించి రూ. 7.50 వద్ద నిలిచింది.

న్యాయ సలహా.. 
ఎస్‌ఐఏసీ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను పరిశీలిస్తున్నామని, వీటిపై న్యాయసలహాలను తీసుకోనున్నట్లు కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. రిటైల్‌ ఆస్తుల విక్రయానికి ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో రూ. 24,713 కోట్లకు ఫ్యూచర్‌ గ్రూప్.. డీల్‌ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎస్‌ఐఏసీ సానుకూలంగా స్పందించింది. ఒప్పందాన్ని నిలిపివేయమంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ ఇంతక్రితం తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఈ డీల్‌ విరుద్ధమైనదంటూ అమెజాన్ ఎస్‌ఐఏసీకి నివేదించింది.

మరిన్ని వార్తలు