ఫ్యూచర్‌ లైఫ్‌ నష్టాలు తగ్గాయ్‌

29 Aug, 2022 06:10 IST|Sakshi

క్యూ1లో రూ. 136 కోట్లకు పరిమితం

న్యూఢిల్లీ: కిశోర్‌ బియానీ గ్రూప్‌ కంపెనీ ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 136 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 348 కోట్ల నష్టాలు ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతంపైగా నీరసించి రూ. 273 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 298 కోట్ల ఆదాయం అందుకుంది. మొత్తం వ్యయాలు 33 శాతంపైగా క్షీణించి రూ. 437 కోట్లకు చేరాయి.

గత క్యూ1లో ఇవి రూ. 656 కోట్లుగా నమోదయ్యాయి. కాగా.. రుణదాతలతో కుదిరిన వన్‌టైమ్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రానున్న 12 నెలల్లోగా అసలు రూ. 422 కోట్లు చెల్లించవలసి ఉన్నట్లు ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ తెలియజేసింది. వీటిలో దీర్ఘకాలిక రుణాల వాటా రూ. 277 కోట్లుకాగా.. స్వల్పకాలిక రుణాలు రూ. 145 కోట్లుగా తెలియజేసింది. ఈ జూన్‌ 30కల్లా బ్యాంకులకు చెల్లించవలసిన రూ. 335 కోట్ల రుణ చెల్లింపుల్లో ఇప్పటికే విఫలమైనట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆస్తుల కంటే అప్పులు రూ. 1,181 కోట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొంది. 

మరిన్ని వార్తలు