భేషుగ్గా పెట్టుబడుల ఉపసంహరణ

5 Feb, 2021 06:19 IST|Sakshi

పన్నేతర ఆదాయం కూడా పెరుగుతుంది

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ఆశాభావం

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ప్రకటించినట్టుగా ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కేలండర్‌ సజావుగా కొనసాగుతుందన్న నమ్మకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కనబరిచారు. ఫిక్కీ సభ్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో పెద్ద ఎత్తున నిధులను వెచ్చించడం  జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఫిక్కీ ట్వీట్‌ చేయగా, ఆర్థిక మంత్రి రీట్వీట్‌ చేశారు. 2021–22లో పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకుంటామని బడ్జెట్‌లో భాగంగా మంత్రి చెప్పడం గమనార్హం. బీపీసీఎల్, ఎయిర్‌ ఇండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్, కంటెయినర్‌ కార్పొరేషన్, ఐడీబీఐ, బీఈఎమ్‌ఎల్, పవన్‌హన్స్, నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌తోపాటు.. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడులను 2021–22 సంవత్సరంలో ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనలను మంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు. దీనికి తోడు ఎల్‌ఐసీ నుంచి అతిపెద్ద ఐపీవో రూపంలోనూ భారీగా నిధులు సమకూర్చుకోవాలనుకుంటోంది.

ఏ వర్గంపైనా భారం వేయకుండానే..  
భారత్‌లోని ఏ వర్గంపైనా భారం మోపలేదన్న విషయాన్ని మంత్రి సీతారామన్‌ గుర్తు చేశారు. ఆదాయం ఈ ఏడాది నుంచి మెరుగుపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ.. పెట్టుబడుల ఉపసంహరణ మార్గంలోనే కాకుండా, పన్నేతర ఆదాయాన్ని సమకూర్చుకుంటూ అందుకు ఆస్తుల విక్రయాన్ని ప్రస్తావించారు. భారీగా నిధులను వ్యయం వెచ్చించాల్సి ఉండడంతో పన్నేతర ఆదాయ మార్గాలపై బడ్జెట్‌లో దృష్టి పెట్టినట్టు వివరించారు. ప్రభుత్వం ఒక్కటే పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వచ్చినా కానీ పెరుగుతున్న దేశ ఆకాంక్షలను తీర్చలేదంటూ ప్రైవేటు రంగం కూడా ముఖ్య భూమిక పోషించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ‘‘పన్నులు పెంచకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రదర్శించిన భిన్నమైన బడ్జెట్‌ ఇది. ఔత్సాహిక వ్యాపార స్ఫూర్తిని ఇది పెంచుతుంది. పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు ముందుకు రావాలి. బడ్జెట్‌లో ప్రదర్శించిన స్ఫూర్తిని పరిశ్రమ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నాను. పరిశ్రమ రుణ భారాన్ని దించుకుంది. కనుక ఇప్పుడిక విస్తరణపై మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి దిశగా ప్రయాణించేందుకు సిద్ధం కావాలి’’ అని మంత్రి పిలుపునిచ్చారు. 2021–22లో రూ.34.83 లక్షల కోట్లను ప్రభుత్వం వ్యయాల కోసం కేటాయించడం గమనార్హం.

త్వరలో మలి జాబితా..
► నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణకు అనుకూలమైన ప్రభుత్వరంగ సంస్థల మలి జాబితాను వచ్చే కొన్ని వారాల్లో సిద్ధం చేయనున్నట్టు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ప్రతిపాదిత అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల ఏర్పాటు బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏల) సమస్యను పరిష్కరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూటీఐ మాదిరే ఇవి కూడా తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తాయని అభిప్రాయపడ్డారు. ఒక అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, ఒక అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. పెట్టుబడుల ఉపసంహరణపైనా ఆమె ప్రకటన చేశారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు వీలుగా తదుపరి జాబితాను నీతి ఆయోగ్‌ రూపొందిస్తుందని సీతారామన్‌ పేర్కొనడం గమనార్హం. ఈ ప్రక్రియ మొదలైందని, కొన్ని వారాల్లోనే జాబితాను సిద్ధం చేస్తామని మోదీ చెప్పారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల మోదీ సర్కారు ఎప్పటికప్పుడు తన అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనకు స్పందిస్తూ.. అన్ని పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో ఈ సంస్కరణలు అజెండాగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు