గెయిల్‌ బైబ్యాక్‌ బాట

1 Apr, 2022 04:09 IST|Sakshi

షేరుకి రూ. 190 ధరలో 5.7 కోట్ల షేర్లు

రూ. 1083 కోట్ల కేటాయింపునకు బోర్డు సై

న్యూఢిల్లీ: యుటిలిటీ పీఎస్‌యూ దిగ్గజం గెయిల్‌ ఇండియా బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గురువారం(31న) సమావేశమైన బోర్డు పెయిడప్‌ ఈక్విటీలో 2.5 శాతం వాటాను బైబ్యాక్‌ చేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు గెయిల్‌ పేర్కొంది. షేరుకి రూ. 190 ధర మించకుండా 5.7 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,083 కోట్లవరకూ వెచ్చించనుంది. ప్రస్తుత బైబ్యాక్‌ ధర ఎన్‌ఎస్‌ఈలో బుధవారం(30న) ముగింపు ధరతో పోలిస్తే 24% అధికంకావడం గమనార్హం!  

గతంలోనూ..: గెయిల్‌ 2020–21 లోనూ షేరుకి రూ. 150 ధరలో రూ. 1,046 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 51.8% వాటా ఉంది. దీంతో ప్రభుత్వం సైతం బైబ్యాక్‌లో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. గత బైబ్యాక్‌లో ప్రభుత్వ వాటాకు రూ. 747 కోట్లు లభించిన సంగతి తెలిసిందే. కాగా.. 2021–22లో కంపెనీ మధ్యంతర డివిడెండ్‌ కింద రికార్డ్‌ సృష్టిస్తూ రూ. 3,996 కోట్లు(90 శాతం) చెల్లించింది. ఇక 2009, 2017, 2018 లతోపాటు 2020లోనూ వాటాదారులకు బోనస్‌ షేర్లను సైతం జారీ చేసింది.  
ఎన్‌ఎస్‌ఈలో గెయిల్‌  షేరు 2 శాతం పుంజుకుని రూ. 156 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు