గెయిల్‌ లాభం జూమ్‌ 

5 Aug, 2022 11:00 IST|Sakshi

క్యూ1లో రూ. 3,251 కోట్లు 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యుటిలిటీ దిగ్గజం గెయిల్‌ ఇండియా ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌-జూన్‌(క్యూ1)లో నికర లాభం 51 శాతం జంప్‌చేసి రూ. 3,251 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో కేవలం రూ. 2,157 కోట్లు ఆర్జించింది. నేచురల్‌ గ్యాస్‌ మార్కెటింగ్‌ మార్జిన్లు భారీగా మెరుగుపడటం ఇందుకు సహకరించింది.

మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 38,033 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 17,702 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. పన్నుకుముందు లాభం ఐదు రెట్లు ఎగసి రూ. 2,318 కోట్లకు చేరింది. గత క్యూ1లో ఇది రూ. 450 కోట్లు మాత్రమే. ప్రస్తుత సమీక్షా కాలంలో గెయిల్‌ స్టాండెలోన్‌ నికర లాభం 91 శాతం దూసుకెళ్లి రూ. 2,915 కోట్లయ్యింది. ఈ కాలంలో పైపులైన్లు, పెట్రోకెమికల్స్, భాగస్వామ్య సంస్థ ఈక్విటీ పెట్టుబడులకుగాను రూ. 1,975 కోట్లు వెచ్చించింది.  ఫలితాల నేపథ్యంలో గెయిల్‌ షేరు గురువారం  0.6 శాతం నీరసించింది. శుక్రవారం కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఏకంగా 4 శాతం పతనమైంది.

మరిన్ని వార్తలు