క్రిప్టో కరెన్సీలో దిట్ట.. 13 ఏళ్ల మన భారతీయ బిడ్డ!

4 Aug, 2021 13:00 IST|Sakshi

వర్చువల్‌ కరెన్సీ వ్యాపారంలో ఇండియాకు చెందిన గజేశ్‌నాయక్‌ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇంకా పదో తరగతి పూర్తి చేయకముందే కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని పనితీరు మెచ్చి ప్రపంచ కుబేరులు అతని సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారు. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: గజేశ్‌ నాయక్‌, వయస్సు 13 ఏళ్లు, చదివేది 9వ తరగతి, నివసించేది గోవా. ఇవేమీ అతని ప్రత్యేకతలు కావు. కానీ అతను  నెలకొల్పిన  బిజినెస్‌ యాప్‌ ఆర్థిక కార్యకలాపాల విలువ అక్షరాల యాభై కోట్ల రూపాయలకు పైమాటే. పదో తరగతి కూడా పాస్‌ కాకుండానే గజేశ్‌ ఈ ఘనత సాధించాడు. ఇండియాలో మొగ్గదశలోనే ఉన్న క్రిప్టో కరెన్సీ కార్యకలాపాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాడు. కరోనా సంక్షోభంలో స్టార్టప్‌లు ఇబ్బందులు పడుతుంటే అందుకు భిన్నంగా ముందుకెళ్తున్నాడు గజేశ్‌.

చదువులో దిట్ట
గోవా రాజధాని పనాజీలోని పీపుల్స్‌ హై స్కూల్‌ చెందిన గజేశ్‌ నాయక్‌ చిన్నప్పటి నుంచే చదువులో దిట్ట, గణితంలో మేటి. చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. అందువల్లే కరోనా కారణంగా పాఠశాలు మూత పడినప్పుడు, తన కంటే కింది తరగతి  విద్యార్థుల కోసం స్టడీ కంటెంట్‌ రెడీ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాడు. పాఠశాలలు తెరుచుకోపోవడంతో న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీలో సర్టిఫికేట్‌ కోర్సులు పూర్తి చేశాడు. సీ, సీ ప్లస్‌, జావా స్క్రిప్ట్‌, సోలిడిటీలలో ఆరితేరాడు. 

క్రిఫ్టోకరెన్సీపై ఫోకస్‌
గోవాలో 2018లో జరిగిన ఇంటర్నేషనల్‌ బ్లాక్‌ చెయిన్‌ సమావేశాల్లో గజేశ్‌ పాల్గొన్నాడు. అప్పటి నుంచే బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, ఆర్టిపీషియల్‌ ఇంటిలిజెన్స్‌పై ఆసక్తి పెరిగింది. లాక్‌డౌన్‌ టైంలో నేర్చుకున్న కొత్త కోర్సులను తన ఆసక్తికి జత చేశాడు. కోడింగ్‌ రాయడం సుళువైంది. ఆ తర్వాత వర్చువల్‌ కరెన్సీ మార్కెటైన క్రిప్టో కరెన్సీపై ఫోకస్‌ చేశాడు. క్రిప్టో కరెన్సీపై అనుభవం ఉన్న నిపుణులతో చర్చలు జరిపాడు. అనంతరం తనే స్వంతంగా పాలీగజ్‌ పేరుతో కొత్త డీయాప్‌ను రూపొందించాడు.

డీ సెంట్రలైజ్డ్‌ 
పాలిగాన్‌ బ్లాక్‌చైయిన్‌ టెక్నాలజీపై  డీఫై ప్రోటోకాల్ ఆధారంగా గజేశ్‌ రూపొందించిన పాలిగజ్‌ డీయాప్‌  క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వ్యవహరాలను నిర్వహిస్తుంది. ఇందులో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిజినెస్‌ని ఎటువంటి చట్టపరమైన అనుమతులు, మధ్యవర్తులు, దళారులు లేకుండానే నిర్వహించవచ్చు. ఈ పద్దతిలో వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలపై ఏ ఒక్కరి పెత్తనం ఉండదు, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ ప్రోటోకాల్‌లోనే అన్ని వ్యవహరాలు ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయి.

7 మిలియన్‌ డాలర్లు
పాలిగజ్‌లో డీయాప్‌పై ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే దీని నిర్వాహాణ సామర్థ్యం వన్‌ మిలియన్‌ డాలర్లకి  చేరుకుంది. పాలిగజ్‌ యాప్‌ పనితీరు నచ్చడంతో ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్‌ మార్క్‌ క్యూబన్‌ ఆసక్తి చూపించారు. తాను పెట్టుబడులు పెట్టారు. దీంతో ఇప్పుడు పాలిగజ్‌ నిర్వాహణ సామర్థ్యం 7 మిలియన్‌ డాలర్లకు  చేరుకుంది. ఒక 13 ఏళ్ల భారతీయ బాలుడు స్థాపించిన పాలిగజ్‌ యాప్‌ అమెరికన్లు సైతం ఆశ్చర్యపరిచే రీతిలో పెర్ఫ్మామ్‌ చేస్తోంది.

డీఫై ప్రోటోకాల్‌
సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్‌ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్‌డ్‌ ఫైనాన్స్‌ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్‌ చెయిన్‌ అనే ఆర్టిఫీయల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్‌ అంటే డీ సెంట్రలైజ్డ్‌ యాప్‌ అని అంటారు. 

మరిన్ని వార్తలు