చుక్కలనంటుతున్న ‘అద్దెలు’,కట్టలేక ఖాళీ చేస్తున్న జనాలు

6 Nov, 2022 12:29 IST|Sakshi

బ్రిటన్‌లో లివర్‌పూల్‌ శివార్లలోని నారిస్‌ గ్రీన్‌ ప్రాంతానికి చెందిన గాలింగేల్‌ రోడ్‌ను ఇప్పుడంతా ‘దెయ్యాలవీథి’ గా పిలుచు కుంటున్నారు. ఎందుకలా? అక్కడేమైనా క్షుద్రపూజల వంటివి జరుగుతున్నాయా? అతీంద్రియ శక్తుల కదలికలేమైనా ఉన్నాయా? అంటే, అలాంటివేమీ లేవు. మరి దెయ్యాలవీథిగా పేరు ఎందుకొచ్చిందనేగా మీ అనుమానం? లండన్‌ తర్వాత బ్రిటన్‌లో ఖరీదైన ప్రాంతాల్లో లివర్‌పూల్‌ ఒకటి. 

లివర్‌పూల్‌ నడిబొడ్డునే కాదు, శివారు ప్రాంతాల్లో కూడా ఇటీవల ఇళ్ల అద్దెలు చుక్కలనంటే స్థాయిలో పెరిగాయి. గాలింగేల్‌ రోడ్‌లోనూ ఇళ్ల అద్దెలు జనాల తాహతుకు మించి పెరగడం మొదలవడంతో, ఇంతకాలం ఇక్కడ ఉంటూ వచ్చిన వారిలో చాలామంది ఒక్కొక్కరుగా ఇళ్లు ఖాళీచేసి వేరేచోటుకు తరలి పోయారు.

ఇంకా మిగిలిన ఒకటీ అరా కుటుంబాల వారు కూడా వీలైనంత త్వరలోనే ఇక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకుని వేరేచోటుకు తరలిపోయే ఆలోచనల్లో ఉన్నారు. దాదాపు తొంభై శాతానికి పైగా ఇళ్లు ఖాళీ కావడంతో ఈ వీథి వీథంతా కొన్ని నెలలుగా నిర్మానుష్యంగా మారింది. దీంతో స్థానికులు ఈ ప్రాంతాన్ని ‘ఘోస్ట్‌ స్ట్రీట్‌’గా పిలుచుకుంటున్నారు.

 ‘ఇంటి అద్దె ఒకేసారి 680 పౌండ్ల (రూ.65 వేలు) నుంచి 750 పౌండ్లకు (71 వేలు) పెరిగింది. ఈ అద్దె భరించడం మాకు శక్తికి మించిన పని. త్వరలోనే ఇల్లు ఖాళీచేసి వేరేచోటుకు వెళ్లిపోదామనుకుంటున్నాం. ఇక్కడ మిగిలిన ఒకటీ అరా కుటుంబాల వారు కూడా ఇతర ప్రాంతాల్లో ఇళ్ల కోసం వెదుకులాడుతున్నారు. తగిన ఇల్లు దొరికితే ఈ వీథిని ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఉన్న కాసిని కుటుంబాలు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతే పూర్తిగా ఇది ‘ఘోస్ట్‌స్ట్రీట్‌’గానే మిగులుతుంది’ అని ఆండీ అనే ఈ ప్రాంతవాసి తెలిపారు. 

మరిన్ని వార్తలు