ఆన్‌లైన్‌ గేమింగ్‌ కోసం.. కేవైసీ ఇవ్వాలి

16 Apr, 2022 00:59 IST|Sakshi

భారీగా విస్తరిస్తున్న పరిశ్రమ

చేతులు మారుతున్న పెద్ద మొత్తం

పీఎంఎల్‌ఏ కిందకు స్కిల్‌ గేమింగ్‌ సంస్థలు

కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ స్కిల్‌ గేమింగ్‌ పరిశ్రమ భారీగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది. దీంతో ఈ గేమింగ్‌ పరిశ్రమను యాంటీ మనీ లాండరింగ్‌ చట్టం (అక్రమ నగదు చెలామణి నిరోధక/పీఎల్‌ఎంఏ) పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. దీనివల్ల అక్రమ నగదు చెలామణిని నిరోధించడమే కాకుండా, ఉగ్రవాదులకు నిధులు అందకుండా కట్టడి చేసినట్టు అవుతుంది.

మనీ లాండరింగ్‌ చట్టం పరిధిలోకి తీసుకొస్తే స్కిల్‌ గేమింగ్, ఈ గేమింగ్‌ కంపెనీలన్నీ కూడా తమ కస్టమర్లకు సంబంధించి కేవైసీ నిబంధనలను అనుసరించాలి. బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు, స్టాక్స్‌ కొనుగోలుకు ఇస్తున్నట్టే.. ఈ గేమింగ్‌/స్కిల్‌ గేమింగ్‌ యూజర్లు తమకు సంబంధించి కేవైసీ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు గేమింగ్‌కు సంబంధించి యూజర్ల లావాదేవీలను ప్రభుత్వం ట్రాక్‌ చేయగలుగుతుంది.  

పారదర్శకత లేదు..  
ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమలో పారదర్శకత లేదని వెల్లడైంది. కొన్ని నగదు లావాదేవీలకు సంబంధించి వివరాలను దర్యాప్తు సంస్థలు పొందలేకపోయాయి. ఈ గేమింగ్‌ సంస్థలు తమ కస్టమర్ల విషయంలో పూర్తి స్థాయి వివరాలను సేకరించడం, ధ్రువీకరించడం చేయడం లేదని తెలిసింది. గేమింగ్‌ యాప్‌ల రూపంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టు, వీటికి సంబంధించి కస్టమర్‌ గుర్తింపు వివరాలు లేవని దర్యాప్తులో వెల్లడైనట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

దీంతో కేవైసీ నిబంధనల పరిధిలోకి, పీఎల్‌ఎంఏ కిందకు స్కిల్‌ గేమింగ్‌ యాప్‌లను ప్రభుత్వం తీసుకురానున్నట్టు తెలిపాయి. దీంతో ఆయా సంస్థలు డైరెక్టర్‌తోపాటు, ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. స్కిల్‌ గేమింగ్‌ యాప్స్, ఈ గేమింగ్‌ సంస్థలను పీఎంఎల్‌ఏ పరిధిలోకి తీసుకువస్తే.. నగదు జమ చేస్తున్న వ్యక్తి, లబ్ధి దారు, ఇతర ముఖ్యమైన వివరాలను ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ)కు నివేదించాల్సి ఉంటుంది.

అలాగే, రూ.50,000కు పైన ఎటువంటి లావాదేవీ విషయంలో అయినా అనుమానం ఉంటే, ఆ వివరాలకు కూడా ప్రత్యేకంగా తెలియజేయాలి. పీఎల్‌ఎంఏ చట్టం కిందకు ఆన్‌లైన్‌ స్కిల్‌ గేమింగ్‌ యాప్‌లను కూడా రిపోర్టింగ్‌ సంస్థలుగా తీసుకురావడానికి ముందు.. బ్రిటన్‌కు చెందిన గ్యాంబ్లింగ్‌ చట్టాన్ని పరిశీలించాలన్న సూచన కూడా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలను నియంత్రించే విషయంలో సరైన కార్యాచరణ లేకపోవవడం పట్ల కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపాయి. ప్రస్తుతం ఈ కంపెనీలన్నీ కూడా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ వద్ద నమోదు అవుతున్నాయి. ఈ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులపై నిషేధం కూడా లేదు. స్కిల్‌ గేమింగ్‌ కంపెనీల్లో కొన్ని మాల్టాలో నమోదైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ గ్రే లిస్ట్‌లో ఉన్న ఈ దేశం.. ఆర్థిక అక్రమాలకు వేదికగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేశాయి.

>
మరిన్ని వార్తలు