యాప్‌ సాఫ్ట్‌వేర్‌లపై వ్యయాలు 15% అప్‌

26 Aug, 2022 06:35 IST|Sakshi

2023పై గార్ట్‌నర్‌ అంచనా

న్యూఢిల్లీ: దేశీయంగా ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌లపై కంపెనీలు చేసే వ్యయాలు 2023లో 14.9 శాతం పెరిగి 4.7 బిలియన్‌ డాలర్లకు చేరనున్నాయి. ఇందులో అత్యధిక భాగం వాటా కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్, రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ల వ్యయాలదే ఉండనుంది. ప్రస్తుత ఏడాది ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌లపై వ్యయాలు 14.6 శాతం పెరిగి 4.15 బిలియన్‌ డాలర్లకు చేరనున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ గార్ట్‌నర్‌ ఒక నివేదికలో ఈ అంశాలు తెలిపింది.

డిజిటల్‌ బాట పట్టే క్రమంలో దేశీ కంపెనీలు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై చేసే వ్యయాల్లో భాగంగా సాఫ్ట్‌వేర్‌పైనా గణనీయంగా వెచ్చించనున్నాయని గార్ట్‌నర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నేహా గుప్తా పేర్కొన్నారు. వ్యాపారాల్లో అన్ని అంశాలను నిర్వహించుకునేందుకు కంపెనీలు..సాఫ్ట్‌వేర్‌లపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపారు. అయితే, 2021తో పోలిస్తే 2022లో సాఫ్ట్‌వేర్‌పై వ్యయాలు కొంత తగ్గవచ్చని నేహా వివరించారు. అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులకు లోనవుతుండటంతో వ్యాపారాలకు అనిశ్చితి పెరగడం ఇందుకు కారణమని పేర్కొన్నారు.  

నివేదికలో మరిన్ని అంశాలు..
► కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం) సాఫ్ట్‌వేర్‌పై వ్యయాలు 2022లో 18.1 శాతం పెరిగి 1.13 బిలియన్‌ డాలర్లకు చేరనున్నాయి. వచ్చే ఏడాది 18.5 శాతం పెరిగి 1.34 బిలియన్‌ డాలర్లకు చేరతాయి.
► 2023లో ఈమెయిల్, ఆథరింగ్‌ విభాగం 16.5 శాతం పెరిగి 768 మిలియన్‌ డాలర్లకు చేరుతుంది. ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ సాఫ్ట్‌వేర్‌ 10.3 శాతం పెరిగి 566 మిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందుతుంది. అనలిటిక్స్‌ ప్లాట్‌ఫాం 18.5 శాతం (495 మిలియన్‌ డాలర్లకు), కంటెంట్‌ సర్వీసులు 14.8 శాతం (366 మిలియన్‌ డాలర్లకు), సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌పై వ్యయాలు 11.4 శాతం (241 మిలియన్‌ డాలర్లకు) వృద్ధి చెందనున్నాయి. 

మరిన్ని వార్తలు