మస్క్‌, బెజోస్‌లను అధిగమించిన అదానీ!

12 Mar, 2021 19:18 IST|Sakshi

భారతీయ ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ సంపాదన భారీగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు ఈ ఏడాది(2021)లో అమాంతం పెరగడంతో అతని సంపదన కూడా అదే రీతిన పెరిగింది. ప్రపంచ కుబేరులైన ఎలన్‌ మస్క్‌, జెఫ్ బెజోస్‌ కంటే అదానీ 2021లో ఎక్కువ సంపదను సంపాదించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ నికర విలువ 2021లో 16.2 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనితో ఈ ఏడాదిలో అత్యధికంగా సంపాదించే వ్యక్తిగా నిలిచారు. అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు ఒకటి మినహా మిగిలిన అన్నీ షేర్ల ధరలు 50 శాతం మేర పెరగడంతో అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది.

ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ల డాలర్లు పెరగడం విశేషం. అదానీ భారతదేశంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరిస్తున్నారు. అదానీ గ్రూప్ కు ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు గనులు, పవర్‌ ప్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి. గత నెలలో 1 గిగావాట్ సామర్థ్యం డేటా సెంటర్‌ను దేశంలో అభివృద్ధి చేయడానికి అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఒక ఒప్పందంపై కూడా సంతకం చేసింది. దింతో సాంకేతిక రంగంలోనూ అదానీ గ్రూప్‌ అడుగుపెట్టినట్లయ్యింది. ఈ సంవత్సరం అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 96 పెరిగితే ప్రధానమైన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 90 శాతం పురోగతి సాధించింది. అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ షేర్లు 79 శాతం, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లిమిటెడ్ షేర్లు 52శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు గత ఏడాది 500 శాతం పైగా పెరిగిన మళ్లీ ఈ ఏడాదిలో 12 శాతం పెరిగింది.

చదవండి:

ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త!

నాలుగు రోజులు బ్యాంకులకు వరుస సెలవులు!

మరిన్ని వార్తలు