బెజోస్‌ మస్క్‌ అదానీ ముందు దిగదుడుపే!

17 Mar, 2022 01:35 IST|Sakshi

2021లో అత్యధిక సంపద సృష్టి

49 బిలియన్‌ డాలర్ల అదనపు విలువ

20 బిలియన్‌ డాలర్లు పెంచుకున్న ముకేశ్‌ అంబానీ 

కొత్తగా ఫాల్గుణి నాయర్‌కు చోటు

హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌–2022

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీ సంపద సృష్టిలో ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలను మించిపోయారు. 2021లో ఏకంగా 49 బిలియన్‌ డాలర్లు (రూ.3.67 లక్షల కోట్లు) మేర తన సంపద విలువను పెంచుకున్నారు. ప్రపంచంలో టాప్‌–3 బిలియనీర్లు అయిన ఎలాన్‌ మస్క్‌ (టెస్లా), జెఫ్‌ బెజోస్‌ (అమెజాన్‌), బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (ఎల్‌వీఎంహెచ్‌) పెంచుకున్న సంపదతో పోలిస్తే.. అదానీ నెట్‌వర్త్‌ వృద్ధి గతేడాది ఎక్కువగా ఉందని ‘ఎం3ఎం హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2022’ ప్రకటించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోటర్‌ ముకేశ్‌ అంబానీ మొత్తం 103 బిలియన్‌ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయునిగా ఈ జాబితాలో కొనసాగారు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే జాబితాలో అంబానీకి 9వ స్థానం దక్కింది. వార్షికంగా చూస్తే 2021లో ఆయన సంపద 24 శాతం పెరిగింది. అంబానీ తర్వాత అదానీయే ఐశ్వర్యవంతుడిగా ఉన్నారు. ఆయన సంపద 2021లో 153 శాతం పెరిగి 81 బిలియన్‌ డాలర్లకు చేరింది. గత పదేళ్లలో అంబానీ నికర విలువ 400 శాతం పెరగ్గా.. ఇదే కాలంలో అదానీ సంపద 1,830 శాతం ఎగసింది. ప్రపంచ బిలియనీర్లలో అదానీకి 12వ ర్యాంకు లభించింది. హెచ్‌సీఎల్‌ కంపెనీ ప్రమోటర్‌ శివ్‌నాడార్‌ 28 బిలియన్‌ డాలర్ల సంపదతో మూడో స్థానంలో (ప్రపంచవ్యాప్తంగా 46వ ర్యాంకు) ఉంటే.. 26 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో సిరమ్‌ ఇనిస్టిట్యూట్‌ సైరస్‌ పూనవాలా, 25 బిలియన్‌ డాలర్ల విలువతో లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.  

ఐశ్వర్యం గణాంకాలు..
► గౌతమ్‌ అదానీ సంపద 2020లో 17 బిలియన్‌ డాలర్లు ఉంటే.. రెన్యువబుల్‌ ఎనర్జీ కంపెనీ అదానీ గ్రీన్‌ ఎనర్జీని లిస్ట్‌ చేసిన తర్వాత ఆయన సంపద ఐదు రెట్లు పెరిగి 81 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం గమనార్హం.
► 2021లో ముకేశ్‌ అంబానీ సంపద 20 బిలియన్‌ డాలర్ల మేర పెరిగింది. సంపదను పెంచుకునే విషయంలో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో ముకేశ్‌ ఉన్నారు.  
► నైకా ప్రమోటర్‌ ఫాల్గుణి నాయర్‌ 7.6 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2022లోకి కొత్తగా అడుగు పెట్టారు.   
► గౌతమ్‌ అదానీ తర్వాత గతేడాది అత్యధికంగా సంపదను పెంచుకున్న వారిలో గూగుల్‌ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్, లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ఉన్నారు.
► హెచ్‌సీఎల్‌ శివ్‌నాడార్‌ నెట్‌వర్త్‌ గత పదేళ్లలో 400 శాతం వృద్ధి చెందింది.  
► 23 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో డీమార్ట్‌ అధిపతి రాధాకిషన్‌ దమానీ, ఇంతే నెట్‌వర్త్‌తో హిందుజా గ్రూపు ప్రమోటర్‌ ఎస్పీ హిందుజా జాబితాలో టాప్‌ 100లో నిలిచారు.  
► చైనాలో 1,133 బిలియనీర్లు, అమెరికాలో 716 మంది, భారత్‌లో 215 మంది ఉన్నారు.  
► ప్రపంచ జనాభాలో 18 శాతం భారత్‌లో ఉండగా, ప్రపంచ బిలియనీర్లలో 8 శాతం మందికి భారత్‌ కేంద్రంగా ఉంది.  
► గత పదేళ్లలో భారత బిలియనీర్లు 700 బిలియన్‌ డాలర్ల మేర ఉమ్మడిగా సంపదను పెంచుకున్నారు. ఇది స్విట్జర్లాండ్‌ జీడీపీకి సమానం కాగా, యూఏఈ జీడీపీకి రెండింతలు.  
► బిలియనీర్లకు ముంబై నివాస కేంద్రంగా ఉంది. ఇక్కడ 72 మంది ఉంటే, ఢిల్లీలో 51 మంది, బెంగళూరులో 28 మంది ఉన్నారు.  
► గత రెండేళ్లలో బైజూ రవీంద్రన్, ఆయన కుటుంబం సంపద పరంగా 916 ర్యాంకులు మెరుగుపరుచుకుని జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 1083వ ర్యాంకు సొంతం చేసుకుంది. వీరి సంపద 3.3 బిలియన్‌ డాలర్లు.  
► భారత్‌లో 40 మంది గతేడాది బిలియన్‌ డాల ర్లు అంతకుమించి సంపద పెంచుకున్నారు.  
► ఎం3ఎం హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2022లో మొత్తం 69 దేశాల నుంచి 3,381 బిలియనీర్లకు చోటు లభించింది. అంతక్రితం జాబితా నుంచి చూస్తే 153 మంది కొత్తగా వచ్చి చేరారు.

మరిన్ని వార్తలు