గౌతమ్‌ అదానీ: 70 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు.. 2030 కల్లా నెం.1 లక్ష్యం!

8 Sep, 2022 15:01 IST|Sakshi

న్యూఢిల్లీ: సోలార్‌ మాడ్యూల్స్, విండ్‌ టర్బైన్స్, హైడ్రోజన్‌ ఎలక్ట్రోలైజర్స్‌ తయారీకి వీలుగా మూడు గిగా ఫ్యాక్టరీలను నెలకొల్పనున్నట్లు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్‌ అదానీ తాజాగా పేర్కొన్నారు. 2030 కల్లా శుద్ధ ఇంధనాలపై 70 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెచ్చించే ప్రణాళికల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. గ్రీన్‌ ఎనర్జీ వేల్యూ చైన్‌లో భాగంగా అదానీ గ్రూప్‌ పెట్టుబడులను హెచ్చిస్తోంది. తద్వారా 2030కల్లా ప్రపంచంలోనే నంబర్‌వన్‌ పునరుత్పాదక ఇంధన కంపెనీగా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వాతావరణ మార్పులు, గ్రీన్‌ ఎనర్జీపై తమ గ్రూప్‌ 70 బిలియన్‌ డాలర్లను వెచ్చించేందుకు కట్టుబడి ఉన్నట్లు గౌతమ్‌ అదానీ మరోసారి స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా దేశంలో మూడు గిగా ఫ్యాక్టరీల నిర్మాణానికి తెరతీయనున్నట్లు తెలియజేశారు. వెరసి ప్రపంచంలోనే అత్యుత్తమ సమీకృత గ్రీన్‌ ఎనర్జీ వేల్యూ చైన్‌ గ్రూప్‌గా నిలిచేందుకు వీలుంటుందని వివరించారు. యూఎస్‌ఐబీసీ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు స్వీకరించిన సందర్భంగా గౌతమ్‌ అదానీ ఈ విషయాలు వెల్లడించారు.

చదవండి: iPhone14: స్టీవ్‌ జాబ్స్‌ కుమార్తె సెటైర్‌ ఏమైంది?

మరిన్ని వార్తలు