Gautam Adani: గౌతమ్‌ అదానీ సంచలన నిర్ణయం.. ఛారిటీ కోసం వేల కోట్లు

23 Jun, 2022 19:38 IST|Sakshi

గత కొన్నేళ్లుగా వ్యాపార రంగంలో రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న గౌతమ్‌ అదానీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు వ్యాపారంలో ఇబ్బడిముబ్బడిగా లాభాలు సంపాందించిన అదానీ ఇప్పుడు సేవా మార్గం బాట పట్టారు. తన తండ్రి వందవ జయంతి తన 60 పుట్టిన రోజును పురస్కరించుకుని కీలక నిర్ణయం వెల్లడించారు. అదానీ గ్రూపు ద్వారా రాబోయే రోజుల్లో 60 వేల కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేయబోతున్నట​​‍్టు స్వయంగా ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. 

దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తదితర రంగాల్లో ఈ నిధులు ఖర్చు చేయన్నారు. బంగారు భారత్‌ లక్ష్యంగా సామాజిక సమానత్వం సాధించేందుకు అదాని కుటుంబం పాటుపడుతుందని ఆయన వెల్లడించారు. దేశీయంగా దాతృత్వంలో అజీమ్‌ ప్రేమ్‌జీ, రతన్‌టాటాలు ముందు వరుసలో ఉన్నారు. తాజా నిర్ణయంతో ఆ దిగ్గజాల సరసన గౌతమ్‌ అదానీ నిలవనున్నారు. 

గత నాలుగేళ్లుగా వ్యాపార రంగంలో అదానీ పట్టిందల్లా బంగారం అవుతూ వచ్చింది. బొగ్గు గనులు, పవర్‌ ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్టులు, మీడియా ఇలా అన్ని రంగాల్లో ఆదానీ గ్రూపు సంచలన విజయాలు సాధించింది. దీంతో అనతి కాలంలోనే ఆయన ప్రపంచ కుబేరుల్లో టాప్‌ టెన్‌ జాబితాలో చోటు సాధించగలిగారు. ఒక దశలో సంపదలో ముఖేశ్‌ అంబానీని కూడా వెనక్కి నెట్టారు. అంతా ఆయన సంపద పెరిగిన తీరు గురించి చర్చ జరుపుతున్న సమయంలో అకస్మాత్తుగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు అదానీ.

చదవండి: స్వావలంబనే భారత్‌కు మార్గం: గౌతం అదానీ

మరిన్ని వార్తలు