Gautam Adani: మరో ఘనత: బిజినెస్ మాగ్నెట్లకు షాకిచ్చి మరీ

30 Aug, 2022 09:13 IST|Sakshi

ప్రపంచంలోనే మూడో కుబేరుడుగా గౌతం అదానీ 

ఆసియాలోనే ఈ రికార్డు సాధించిన తొలి వ్యక్తి

సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్  అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారదిగ్గజం  బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి మరీ ప్రపంచ కుబేరుల సరసన  చోటు సంపాదించడం విశేషం. అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానాన్ని సాధించిన  తొలి ఆసియా  వ్యక్తిగా రికార్డును తన ఖతాలో వేసుకున్నారు. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా, సంపన్నుల జాబితాలో  నిలిచినప్పటికీ  ఎప్పుడూ మొదటి మూడు స్థానాలకు చేరుకోలేదు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆసియాకు చెందిన వ్యక్తి మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. 137.4 బిలియన్ల డాలర్ల మొత్తం నికర విలువతో, 60 ఏళ్ల అదానీ, సంపదలో లూయిస్ విట్టన్ ఛైర్మన్ ఆర్నాల్ట్‌ను అధిగమించారు. అంతేకాదు ఈ  ర్యాంకింగ్‌లో బిజినెస్ మాగ్నెట్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌ల సమీపంలోకి వచ్చారు. ప్రస్తుతం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ నికర విలువ వరుసగా 251 బిలియన్‌‌ డాలర్లు, 153 బిలియన్ డాలర్లుగా ఉంది.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కాగా ఈ ఇండెక్స్‌లో ముఖేశ్‌ అంబానీ మొత్తం 91.9 బిలియన్ల డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు. దేశీయంగా అదానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్  తర్వాత మూడో అతిపెద్ద వ్యాపారసంస్థగా ఉంది.

ఒక్క 2022 లోనే అదానీ సంపద 60.9 బిలియన్ డాలర్లు పెరిగింది. మిగిలిన బిలియనీర్లతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి ఆసియా కుబేరుడిగా ముఖేశ్‌ అంబానీని దాటేశారు. ఆ తరువాత  ఏప్రిల్‌లో సెంట్‌ బిలియనీర్‌ అయ్యారు. గతనెలలో మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ అధినేత బిల్‌గేట్స్‌ను తలదన్ని  ప్రపంచంలో నాల్గవ సంపన్న వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు