ఎన్‌డీటీవీలో అదానీ పైచేయి

5 Dec, 2022 06:31 IST|Sakshi

ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా 53 లక్షల షేర్లు సొంతం

చైర్మన్‌సహా ఇద్దరు డైరెక్టర్ల ఎంపికకు చాన్స్‌

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ ఇచ్చి­న ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా ఇన్వెస్టర్లు 53.27 లక్షల షేర్లు విక్రయించేందుకు ఆసక్తి చూపినట్లు ఎన్‌డీటీవీ తాజాగా వెల్లడించింది. దీంతో మీడియా సంస్థలో అదానీ గ్రూప్‌ అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. ఎన్‌డీటీవీలో పరోక్షంగా 29.18 శాతం వాటాను పొందిన అదానీ గ్రూప్‌ మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. షేరుకి రూ. 294 ధరలో 1.67 కోట్ల షేర్ల కొనుగోలుకి సిద్ధపడింది. శుక్రవారం(2న) ముగింపు ధర రూ. 415తో పోలిస్తే ఆఫర్‌ ధర 41 శాతం తక్కువకాగా.. షేర్ల కొనుగోలు నేడు(5న) ముగియనుంది.  

కార్పొరేట్‌ ఇన్వెస్టర్లు సై
ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం కార్పొరేట్‌ ఇన్వెస్టర్లు 39.34 లక్షల షేర్లు, రిటైలర్లు 7 లక్షలకుపైగా, అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్‌) 6.86 లక్షల షేర్లు చొప్పున టెండర్‌ చేశారు. ఇవి ఆఫర్‌లో 32 శాతంకాగా.. 8.26 శాతం వాటాను అదానీ గ్రూ ప్‌ సొంతం చేసుకోనుంది. వెరసి ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌ వాటా 37.44 శాతానికి బలపడనుంది. తద్వారా ఎన్‌డీటీవీ వ్యవస్థాపకులు ప్రణవ్‌ రా య్, ఆయన భార్య రాధికా రాయ్‌ల సంయుక్త వా టా 32.26 శాతాన్ని మించనుంది. దీంతో చైర్మన్‌ పదవికి అదానీ గ్రూప్‌ అభ్యర్థిని నియమించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. చైర్మన్‌సహా ఇద్దరు డైరెక్టర్లను నియమించవచ్చని తెలియజేశాయి. ప్రస్తుతం ఎన్‌డీటీవీకి ప్రణవ్‌ రాయ్‌ (15.94 శాతం వాటా) చైర్‌పర్శన్‌గా, రాధిక(16.32 శాతం) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వాటాల రీత్యా వీరిరువురూ డైరెక్టర్లుగా కొనసాగేందుకు వీలుంది.

మరిన్ని వార్తలు