‘గ్రీన్‌’ విద్యుత్‌పై 20 బిలియన్‌ డాలర్లు

5 Oct, 2021 00:45 IST|Sakshi
హైదరాబాద్‌లో సోమవారం టై సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్‌ రెడ్డి, జయేష్‌ రంజన్‌ (ఎడమ నుండి కుడికి మూడో, నాలుగో వ్యక్తులు) తదితరులు 

వచ్చే దశాబ్దకాలంలో అదానీ గ్రూప్‌ పెట్టుబడుల లక్ష్యం 

నాలుగేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 3 రెట్లు పెంచుకుంటాం 

‘టై’ సదస్సులో గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పునరుత్పాదక  (గ్రీన్‌) విద్యుదుత్పత్తి రంగంపై వచ్చే దశాబ్ద కాలంలో 20 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు. పర్యావరణ హిత విద్యుత్‌కు సంబంధించి వివిధ రూపాల్లో తమ పెట్టుబడులు మొత్తం మీద 50–70 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రోలైజర్ల తయారీ భాగస్వాములు మొదలుకుని సౌర.. పవన విద్యుత్‌ వ్యాపారాలకు అవసరమైన ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత పారిశ్రామిక క్లౌడ్‌ ప్లాట్‌ఫాంలు మొదలైనవన్నీ ఈ కోవలోకి వస్తాయని వివరించారు.

వచ్చే నాలుగేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాలను మూడు రెట్లు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు అదానీ పేర్కొన్నారు. ది ఇండస్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ (టై) హైదరాబాద్‌ చాప్టర్‌ సోమవారం నిర్వహించిన సస్టెయినబిలిటీ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్‌గా గౌతమ్‌ అదానీ మాట్లాడారు. మన వైద్య, విద్య, రవాణా తదితర వ్యవస్థల్లో ఉన్న లోపాలను కరోనా మహమ్మారి ఎత్తి చూపిందన్నారు. కోవిడ్‌ లాంటి మహమ్మారులను నిలువరించేందుకు టీకాలైనా ఉన్నాయని.. కానీ వాతావరణ మార్పుల చికిత్సకు ఎలాంటి టీకాలు లేవని అదానీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పు సమస్యలకు తగు పరిష్కార మార్గాలు కనుగొనడమే కాకుండా.. సైన్స్, విధానాలు, సాంకేతిక అభివృద్ధి ద్వారా అందరికీ ప్రయోజనాలు అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 

28 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా భారత్‌ .. 
వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్‌ 28 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తాను గతేడాది చెప్పానని అదానీ పేర్కొన్నారు.  అమెరికా తలసరి ఆదాయంలో ప్రస్తుతం ముప్ఫయ్యో వంతుగా ఉన్న భారత్‌ తలసరి ఆదాయం 2050 నాటికి మూడో వంతుకు చేరుతుందన్నారు. రాబోయే రోజుల్లో అనేక దశాబ్దాల పాటు భారత్‌ రెండంకెల స్థాయి వృద్ధి సాధించగలదని అదానీ చెప్పారు. మరోవైపు, పర్యావరణ హిత విధానాలను, స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ తెలిపారు.  

అక్టోబర్‌ 6 దాకా సదస్సు..
రాబోయే తరాలకు కూడా వనరులను మిగిల్చే విధంగా.. ప్రస్తుత తరం అవసరాలను తీర్చుకునేందుకు పాటించాల్సిన విధానాలపై (సస్టెయినబిలిటీ) చర్చించేందుకు ఇజ్రాయెల్, కోస్టారికాల భాగస్వామ్యంతో టై నిర్వహిస్తున్న సదస్సు అక్టోబర్‌ 6 దాకా జరగనుంది. ఇందులో 64 దేశాల నుంచి 25,000 పైచిలుకు సంస్థలు పాల్గొంటున్నాయి. తొలి రోజున ఇరు దేశాల్లోని వ్యవసాయ, సాంకేతిక తదితర రంగాల స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా ఇజ్రాయెల్, భారత్‌లోని టై విభాగాలు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. 

ఈ సదస్సు ఊతంతో రాబోయే రోజుల్లో స్టార్టప్‌లకు దాదాపు 100 మిలియన్‌ డాలర్ల దాకా పెట్టుబడులు దక్కే అవకాశం ఉందని టీఎస్‌ఎస్‌ 2021 చైర్‌పర్సన్‌ మనోహర్‌ రెడ్డి తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ దౌత్యవేత్త నిక్కి హేలీ (వర్చువల్‌గా), కోస్టా రికా దౌత్యవేత్త క్లాడియో అన్సోరెనా, ఇజ్రాయెల్‌ డిప్యుటీ చీఫ్‌ ఆఫ్‌మిషన్‌రోని క్లెయిన్‌ తదితరులు ఈ 
కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు