సొంత వ్యాపారం కోసమే స్పెక్ట్రమ్‌

3 Aug, 2022 06:17 IST|Sakshi

డేటా సెంటర్లు, ఇతర కార్యకలాపాలకు వినియోగం

ఇందుకోసం ప్రైవేటు నెట్‌వర్క్‌

స్పష్టం చేసిన అదానీ గ్రూపు

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొంటోందన్న విషయం వెలుగు చూసిన తర్వాత విశ్లేషకుల నుంచి ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి. వ్యాపార అవసరాల కోసమే స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొంటున్నట్టు ముందు చెప్పినట్టుగానే అదానీ గ్రూపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 5జీ స్పెక్ట్రమ్‌ కోసం మూడు టెలికం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా రూ.1.5 లక్షల కోట్ల బిడ్లు వేశాయి. కానీ, అదానీ గ్రూపు సంస్థ అయిన అదానీ డేటా నెట్‌వర్క్స్‌ (ఏడీఎన్‌ఎల్‌) కేవలం రూ.212 కోట్లనే స్పెక్ట్రమ్‌ కొనుగోళ్లకు కేటాయించింది.

తద్వారా 26 గిగాహెట్జ్‌ మిల్లీమీటర్‌ వేవ్‌ బ్యాండ్‌లో 20 ఏళ్ల కాలానికి 400 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసింది. రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ వేలంలో అదానీ పెట్టుబడి 0.15 శాతంగానే ఉండడం గమనించాలి. తాము కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌తో ప్రైవేటు నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తామని, దాన్ని డేటా సెంటర్లు, గ్రూపులోని ఇతర కార్యకలాపాలు, అన్ని వ్యాపారాల కలబోతతో ఉండే సూపర్‌ యాప్‌ కోసం వినియోగించుకుంటామని అదానీ గ్రూపు పేర్కొంది. అదానీ గ్రూపు కీలక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, బీటూసీ వ్యాపారాల డిజిటైజేషన్‌ వేగవంతం చేయడానికి 5జీ స్పెక్ట్రమ్‌ సాయపడుతుందని అదానీ గ్రూపు ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు