స్థూల ప్రీమియం ఆదాయం 12 శాతం అప్‌!

28 Apr, 2022 13:11 IST|Sakshi

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనరల్‌ ఇన్సూరెన్స్‌ పరిశ్రమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) 10–12 శాతం మేర వృద్ధి నమోదు చేయవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్‌ ఒక నివేదికలో వెల్లడించింది.

ఆరోగ్య బీమాపై అవగాహన పెరుగుతుండటం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటూ ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. ప్రభుత్వ రంగ బీమా సంస్థల (పీఎస్‌యూ) జీడీపీఐ వృద్ధి 4–6 శాతానికి పరిమితం కావచ్చని, ప్రైవేట్‌ రంగ ఇన్సూరెన్స్‌ సంస్థలు 13–15 శాతం మేర వృద్ధి చెందవచ్చని .. తద్వారా మార్కెట్‌ వాటాను మరింత పెంచుకునే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.  

2022లో ప్రైవేట్‌ రయ్‌.. 
2021 ఆర్థిక సంవత్సరంలో జీడీపీఐ వృద్ధి 4 శాతానికే పరిమితం కాగా కోవిడ్‌–19పరమైన ప్రతికూల పరిస్థితులు తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో 2022 ఆర్థిక సంవత్సరంలో జీడీపీఐ మెరుగుపడి 11 శాతానికి చేరిందని అంచనా వేస్తున్నట్లు ఇక్రా పేర్కొంది. పీఎస్‌యూ బీమా సంస్థల జీడీపీఐ వృద్ధి అయిదు శాతంగా ఉండొచ్చని, ప్రైవేట్‌ రంగ బీమా సంస్థల ప్రీమియం ఆదాయం మాత్రం 14 శాతం మేర పెరిగి ఉంటుందని తెలిపింది.

 దేశవ్యాప్తంగా పాక్షికంగా లాక్‌డౌన్‌లు ఉన్నప్పటికీ 2021–22 తొలి 11 నెలల్లో హెల్త్‌ సెగ్మెంట్‌లో స్థూల ప్రీమియం ఆదాయాలు ఏకంగా 26 శాతం పెరగ్గా, అగ్నిప్రమాదాల బీమా విభాగం ప్రీమియం ఆదాయాలు 8 శాతం స్థాయిలో పెరిగాయని ఇక్రా వివరించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం హెల్త్‌ క్లెయిమ్స్‌లో కోవిడ్‌ క్లెయిమ్‌ల వాటా 6 శాతంగా నమోదైంది. 2021–22లో ఇది 11–12 శాతంగా ఉంటుందని అంచనా. 

మరిన్ని వార్తలు