‘జెనరేషన్‌ జెడ్‌’పై ఎక్కువ ప్రభావం చూపిస్తోన్న కోవిడ్‌

1 Dec, 2021 08:28 IST|Sakshi

వృత్తిపరంగా, ఆర్థికంగా దెబ్బకొట్టిన కరోనా 

ఏడీపీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: యువతరం కార్మికులు, ఉద్యోగులపై కరోనా మహమ్మారి ప్రభావం గట్టిగానే పడింది. జెనరేషన్‌ జెడ్‌ (18–24 వయసువారు)ను వృత్తిపరంగా, ఆర్థికంగా గట్టి దెబ్బకొట్టినట్టు ఏడీపీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న 78 శాతం మంది కరోనా తమ వృత్తి జీవితంపై ప్రభావం చూపించిందని చెప్పారు. 55 ఏళ్లకు పైన ఉన్న వారితో పోలిస్తే తమపై రెండింతల ప్రభావం పడినట్టు పేర్కొన్నారు. 17 దేశాల నుంచి 32,471 మంది కార్మికుల అభిప్రాయాలను ఏడీపీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సర్వేలో భాగంగా తెలుసుకుంది. 

యువ కార్మికులు ప్రతీ ఐదుగురిలో ఇద్దరు (39 శాతం) ఉద్యోగం కోల్పోయినట్టు లేదా తాత్కాలికంగా తొలగింపునకు గురైనట్టు ఈ సర్వే తెలిపింది. అన్ని వయసుల్లోని వారిని పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ఇలా చెప్పిన వారు 28 శాతం మంది ఉన్నారు. భారత్‌లో సగానికి పైగా కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగం కోల్పోతామన్న ఆందోళనను ఎదుర్కొన్నట్టు చెప్పారు. ‘‘యువతరం పనివారిపై భారత్‌లో కరోనా మహమ్మారి ఎక్కువ ప్రభావం చూపించింది. స్వీయ చైతన్యంతో వారు మరింత బలంగా నిలబడి నూతన నైపుణ్యాలపై దృష్టి సారించారు’’అని ఏడీపీ ఇండియా, దక్షిణాసియా ఎండీ రాహుల్‌ గోయల్‌ తెలిపారు.   
 

చదవండి:వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగింపు.. ఎంప్లాయిస్‌పై నజర్‌! ఎప్పటివరకంటే..

మరిన్ని వార్తలు