సీరం వ్యాక్సిన్లు అందుకున్న తొలి విదేశీ దేశం

25 Feb, 2021 09:15 IST|Sakshi

కోవిషీల్డ్ పొందిన ఘనా మొదటి విదేశీ దేశం

ఘనాకి 6 లక్షల కోవిషీల్డ్‌ టీకాలు 

యూఎన్‌ కోవాగ్జ్‌ కార్యక్రమంలో భాగంగా వ్యాక్సినేషన్‌  

అక్రా: భారత్‌లోని పుణెలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ 6 లక్షల డోసులు ఘనా దేశానికి చేరుకున్నాయి. నిరుపేద దేశాలకు కరోనా టీకా లభ్యమయ్యేలా ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన కోవాగ్జ్‌ కార్యక్రమంలో భాగంగా ఈ టీకా డోసుల్ని పంపించారు. 2021 చివరి నాటికి కనీసం 2 బిలియన్ మోతాదుల  కరోనా వ్యాక్సిన్లను అందించే అపూర్వ ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. సీరం త్వరలో 25-30 దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేయనున్నట్లు సీరం సీఈవో అదర్ పూనవల్లా చెప్పారు.  కోవిక్స్ కోవిషీల్డ్  మొదటి  బ్యాచ్‌ మోతాదులను అందించడం చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించిన ఆయన,  మహమ్మారిపై పోరులో భాగంగా  సరసమైన ధరలో, ఇమ్యునోజెనిక్ వ్యాక్సిన్లతో అందించడంలో సీరం ముందంజలో ఉంటుందన్నారు. కోవాక్స్ ఫెసిలిటీ కార్యక్రమం కింద కరోనా టీకా లభించే తొలి దేశం ఘనాయే కావడం విశేషం.

యూనిసెఫ్‌ ఆర్డర్‌ చేసిన ఈ కరోనా టీకా డోసులు ఆక్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి బుధవారం చేరుకున్నాయి. కోవాగ్జ్‌ కార్యక్రమంలో భాగస్వామ్యమైన 92 దేశాల్లో ఘన కూడా ఉన్నట్టుగా ఆ దేశ సమాచార శాఖ మంత్రి కోజో అపాంగ్‌ చెప్పారు. ఘనా జనాభా 3 కోట్లు. ఈ దేశంలోఇప్పటివరకు 81 వేల కేసులు, 600మరణాలు సంభవించాయి. మార్చి 2 నుంచి టీకా డోసుల్ని ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ, వ్యాక్సిన్‌ గ్రూప్‌ గవీ, కొయిలేషన్‌ ఫర్‌ ఎపిడిమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్‌ సంయుక్తంగా పేద దేశాలను ఆదుకోవడానికి ఈ కార్యక్రమం ప్రారంభించాయి.


 

మరిన్ని వార్తలు