India-US: సెమీకండక్టర్లపై భారత్‌తో ఒప్పందం

10 Mar, 2023 00:44 IST|Sakshi

దీర్ఘకాల అవకాశాలపై దృష్టి

అమెరికా వాణిజ్య మంత్రి రైమాండో

న్యూఢిల్లీ: సెమీ కండక్టర్లకు సంబంధించి భారత్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు అమెరికా రక్షణ మంత్రి గినా రైమాండో తెలిపారు. ఈ రంగంలో అపార అవాకాశాలున్నాయంటూ, ఇరు దేశాల మధ్య సహకారానికి ఒప్పందం తోడ్పడుతుందన్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లకు సంబంధించి యూఎస్‌ కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వివిధ దేశాల మధ్య విస్తరించుకోవాలనే (వైవిధ్యం) బలమైన ఆకాంక్షతో ఉన్నట్టు రైమాండో తెలిపారు.

భారత్‌ పర్యటనకు వచ్చిన ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లడారు. ‘‘రెండు దేశాల మధ్య సెమీ కండక్టర్లు, వాటికి సంబంధించి వాణిజ్య అవకాశాలపై మాట్లాడుకున్నాం. సెమీకండక్టర్ల ఎకోసిస్టమ్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కావాల్సిన విధానాలపై చర్చలను ఏ విధంగా కొసాగించాలనే అంశంపైనా మాట్లాడాం. జాయింట్‌ వెంచర్లు లేదా టెక్నాలజీ భాగస్వామ్యాలకు సంబంధించి ఈ చర్చలు జరిగాయి’’అని రైమాండో వివరించారు.

స్వల్పకాల అవకాశాలతోపాటు, దీర్ఘకాల వ్యూహాత్మక అవకాశాలను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్స్‌ సరఫరా వ్యవస్థలో అమెరికా, భారత్‌ పెద్ద పాత్రను పోషించగలవన్నారు. రెండు దేశాలూ వేటికవే సెమీకండక్ట్‌ రాయితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయంటూ.. ఈ విషయంలో రెండు దేశాలు ఏ విధంగా సహకారం ఇచ్చిపుచ్చుకోగలవనే దానిపై మాట్లాడినట్టు చెప్పారు. భారత్‌–అమెరికా వాణిజ్య చర్చా కార్యక్రమం, భారత్‌–అమెరికా సీఈవోల ఫోరం సమావేశం కోసం రైమాండో భారత్‌కు వచ్చారు. ఆమె వెంట అత్యున్నత స్థాయి వాణిజ్య బృందం కూడా ఉంది.  

మరిన్ని వార్తలు