పాన్ - ఆధార్ లింక్ గడువు పొడిగించమని సెబీని కోరిన ఏఎన్ఎంఐ

29 Mar, 2022 14:45 IST|Sakshi

ఇన్వెస్టర్లు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవడానికి మరింత సమయం ఇవ్వాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)ని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) కోరింది. చాలా మంది పెట్టుబడిదారులు తమ పాన్‌ను ఆధార్‌తో ఇంకా లింక్ చేయకపోవడం వల్ల చాలా మంది పెట్టుబడిదారులు మార్కెట్లలో ట్రేడ్ చేయలేరని ఎఎన్ఎంఐ హైలైట్ చేసింది. "పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోవడం వల్ల కొత్త & పాత ఇన్వెస్టర్లు ట్రేడ్ చేయలేకపోవడంతో పాటు వారి డీమ్యాట్ ఖాతాలను కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుంది" అని సెబీకి రాసిన లేఖలో ఏఎన్ఎంఐ పేర్కొంది.

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు తుది గడువు మార్చి 31. మార్చి 31 లోపు కూడా అనుసంధానం చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లదు. రూ.10వేల వరకు జరిమానా కట్టి మళ్లీ పాన్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పాన్ - ఆధార్ లింక్ తుది గడువును ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతానికి ఈ ఏడాది మార్చి 31 ఆఖరు తేదీగా ఉంది. ప్రభుత్వం మరోసారి తుదిగడువు పొడిగిస్తుందో లేదో స్పష్టత లేదు. అందుకే ఇంతవరకు పాన్‌ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోని వారు.. ఎంత వీలైతే అంత త్వరగా చేసుకుంటే మంచిది. 

పెద్ద సంఖ్యలో ఖాతాదారులు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయలేకపోవడంతో క్లయింట్ ఖాతాలను నిలిపివేయడం వల్ల మార్కెట్ మీద భారీ ప్రభావం ఉంటుందని ఏఎన్ఎంఐ తెలిపింది. అందువల్ల, ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఏఎన్ఎంఐ సెబీని కోరింది. ఒకవేళ గడువును పొడిగించలేకపోతే పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోవడం వల్ల కలిగే చిక్కులకు పరిష్కార మార్గాన్ని ఆలోచించాలని, తద్వారా ఖాతాల సస్పెన్షన్ను 6 నెలల పాటు వాయిదా వేయాలని సెబీని ఏఎన్ఎంఐ కోరింది.

(చదవండి: మీ పాన్‌ కార్డ్‌ పోయిందా..! వెంటనే ఇలా చేయండి..!)

మరిన్ని వార్తలు