విస్కీ వ్యర్థాలతో బయో ఇంధనం

27 Jul, 2021 15:13 IST|Sakshi

రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రాలేదు. ఇప్పడు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనం కాకుండా మరో వాహనం మార్కెట్లోకి రానుందా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రముఖ స్కాచ్ విస్కీ బ్రాండ్ "గ్లెన్ ఫిడిచ్" గురుంచి చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పడు ఈ కంపెనీ మద్యం తయారీతో పాటు ఇంధనం తయారీలో అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా తన డెలివరీ వాహనాలలో పెట్రోలకు ప్రత్యామ్నాయంగా విస్కీ వ్యర్థాల నుంచి తయారు చేసిన బయోగ్యాస్ ఇంధనాన్ని ఉపయోగించడం ప్రారంభించింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఇంధనం వాహన కాలుష్యాన్ని(సీఓ2 ఉద్గారాన్ని) 95% వరకు తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. గ్లెన్ ఫిడిచ్ ఇప్పటికే తన డెలివరీ ట్రక్కులను ఈ బయోగ్యాస్ ఇంధనం ద్వారా నడపడం ప్రారంభించింది. "క్లోజ్డ్ లూప్" ధారణీయత ప్రాజెక్ట్ లో భాగంగా ఈశాన్య స్కాట్లాండ్ లోని కంపెనీ డఫ్ టౌన్ డిస్టిలరీలో ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేసింది. విస్కీ వ్యర్థాల నుంచి తయారు చేసిన బయోగ్యాస్ డీజిల్ ఇతర శిలాజ ఇంధనాలతో పోలిస్తే సీఓ2 ఉద్గారాలను 95% కంటే ఎక్కువ తగ్గిస్తుందని, ఇతర హానికరమైన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 99% వరకు తగ్గిస్తుందని గ్లెన్ ఫిడిచ్ పేర్కొంది. ఈ ఇందనాన్ని త్వరగా మార్కెట్లోకి తీసుకొనిరావడానికి కంపెనీ యోచిస్తుంది. ఒకవేల ఈ ఇందనాన్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయగలిగితే కార్బన్, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల నుంచి పర్యావరణాన్ని కాపాడవచ్చు అని కంపెనీ పేర్కొంది.

మరిన్ని వార్తలు