2026-27 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ ఎకానమీగా భారత్‌..!

15 Sep, 2021 21:25 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి 5 ట్రిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.368 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి 8 ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.588 లక్షల కోట్లు) తాజా గ్రీన్‌ఫీల్డ్‌ పెట్టుబడులు అవసరమని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ డెలాయిట్‌ విశ్లేషించింది. గ్రీన్‌పీల్డ్‌ పెట్టుబడి అంటే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ)లో ఒక విధానం. ఈ విధానంలో ఒక పేరెంట్‌ కంపెనీ వివిధ దేశాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందుకు అనుగుణంగా భారీగా పెట్టుబడులు పెడుతుంది. భారత్‌లో ఈ తరహాలో భారీ పెట్టుబడుల ఆవశ్యకతను డెలాయిట్‌ ఇచ్చిన తాజా నివేదికలో వివరించింది. 

కోవిడ్‌-19 సవాళ్లలోనూ దేశానికి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని డెలాయిట్‌ పేర్కొంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఆశావహ పరిస్థితిని, ఆర్థిక మూలాలకు పటిష్టతను అందించిందని వివరించింది. 2020-21లో ఈక్విటీ, రీ-ఇన్వెస్టెడ్‌ ఎర్నింగ్స్, క్యాపిటల్‌సహా రికార్డు స్థాయిలో 81.72 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. కోవిడ్‌ ముందస్తు ఆర్థిక సంవత్సరం (2019-20)తో పోల్చితే ఇవి 10 శాతం అధికం కావడం గమనార్హం. అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్‌లలోని బహుళజాతి కంపెనీలకు చెందిన 1,200 మంది వ్యాపార వేత్తల అభిప్రాయాల ప్రాతిపదికన ఈ సర్వే అధ్యయనం రూపొందింది. (చదవండి: తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు)

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్‌ ఆకర్షణీయ దేశంగా ఉందని నివేదిక పేర్కొంటూ, నిపుణులైన కార్మిక శక్తి, ఎకానమీ వృద్ధి అవకాశాలు దీనికి కారణమని తెలిపింది. భారత్‌లో మరిన్ని సంస్కరణల ఆవశ్యకత అవసరమని పేర్కొన్న నివేదిక, తద్వారా దేశానికి మరింత భారీ స్థాయిలో ఎఫ్‌డీఐలను ఆకర్షించవచ్చని వివరించింది.  

మరిన్ని వార్తలు