మీలో ఈ స్కిల్స్‌ ఉన్నాయా?, 3.64 లక్షల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్‌!

8 Dec, 2022 10:40 IST|Sakshi


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గ్లోబల్‌ క్యాప్టివ్‌ సెంటర్లు (జీసీసీ) వచ్చే 12 నెలల్లో సుమారు 3.64 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకోనున్నాయని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లలో సేవలకు డిమాండ్‌ నేపథ్యంలో ఈ నియామకాలు ఉంటాయని వెల్లడించింది. 

సర్వేలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), హెల్త్‌కేర్, ఫార్మా, ఇంటర్నెట్, టెలికం, ఐటీ సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్, తయారీ, చమురు, సహజ వాయువు, రిటైల్‌ రంగంలో ఉన్న 211 జీసీసీ కంపెనీలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌సహా ఎనమిది నగరాల్లో ఇవి విస్తరించాయి. ‘గ్లోబల్‌ క్యాప్టివ్‌ సెంటర్ల పరిశ్రమ ప్రస్తుత రూ.2.95 లక్షల కోట్ల నుంచి 2026 నాటికి రూ.4.94–7 లక్షల కోట్లకు చేరుతుంది. 

సర్వేలో పాలుపంచుకున్న ఐటీ, సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్‌ రంగ కంపెనీల్లో సిబ్బంది సంఖ్యను పెంచుకోనున్నట్టు 33 శాతం  తెలిపాయి. నియామకాలకు బీఎఫ్‌ఎస్‌ఐలో 21 శాతం, ఇంటర్నెట్, టెలికంలో 16 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించాయి. ప్రస్తుతం కార్యకలాపాలలో ఉన్న ప్రపంచ జీసీసీల్లో భారత్‌ దాదాపు 45 శాతం వాటా కలిగి ఉంది. ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఉపాధిలో ఈ రంగం 2023లో 10.8 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుంది.

 డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, స్టాటిస్టికల్‌ అనాలిసిస్, యూఐ/యూఎక్స్‌ డిజైన్‌ వంటి డిజిటల్, మెషీన్‌ లెర్నింగ్‌ స్కిల్స్‌కు ప్రస్తుతం డిమాండ్‌ ఉంది’ అని నివేదిక వివరించింది. క్లయింట్లు సొంతంగా నిర్వహిస్తున్న డెలివరీ సెంటర్లే జీసీసీలు.    

మరిన్ని వార్తలు