మూడీస్‌ నివేదిక: సామాన్యులకు భారీ షాక్‌!

1 Jul, 2022 08:30 IST|Sakshi

న్యూఢిల్లీ: పెరుగుతున్న రుణ వ్యయాలు, సుదీర్ఘమైన రష్యా–ఉక్రెయిన్‌ వివాదం, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి కారణాలతో ప్రపంచంలో రుణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ గురువారం పేర్కొంది.

ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఇంధనం, ఆహార వ్యయాల పెరుగుదలతోపాటు గృహాల కొనుగోలు శక్తిని ఈ పరిణామాలు బలహీనపరుస్తున్నాయని తెలిపింది. దీనితోపాటు కంపెనీలకు ముడి పదార్థాల వ్యయాలు పెరుగుతున్నాయని, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ దెబ్బతింటోందని వివరించింది. ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... 

సావరిన్‌ డెట్‌ ఇష్యూయర్స్‌కు సంబంధించి రుణ వ్యయాలు పెరిగేకొద్దీ ఈ ఇన్‌స్ట్రమెంట్ల స్థిరత్వం సవాలుగా ఉంటుంది. ఇప్పటికీ పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కోవిడ్‌–19 మహమ్మారి సంక్షోభం నుండి పూర్తిగా కోలుకోని పరిస్థితుల్లో రుణ సమీకరణలో క్లిష్ట పరిస్థితులు మరింత ఇబ్బందులను సృష్టిస్తున్నాయి.  

గ్లోబల్‌ క్రెడిట్‌ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయి. పెరుగుతున్న రుణ వ్యయాలు, రష్యా–ఉక్రెయిన్‌ మధ్య సుదీర్ఘ సైనిక వివాదం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఇంధనం– వస్తువుల ధరలు పెరగడం వంటి అంశాలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో సరఫరాల సమస్య తీవ్రతరంగా ఉంది. ఆర్థిక మార్కెట్‌ అస్థిరత పెరిగింది. 

అనేక దేశాల్లోని కేంద్ర బ్యాంకులు అధిక ద్రవ్యోల్బణానికి ప్రతిస్పందనగా వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించడంతో, ఆర్థిక మార్కెట్‌ పరిస్థితులు అంతర్జాతీయంగా క్లిష్టంగా మారాయి. వడ్డీరేట్ల పెంపు కొనసాగే అవకాశాల నేపథ్యంలో కఠిన ఫైనాన్షియల్‌ పరిస్థితులు నెలకొన్నాయి.  

ఆర్థిక వృద్ధికి ప్రతికూలతలు అసాధారణంగా తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. స్థూలంగా ఎకానమీ అవుట్‌లుక్‌ను మరింత దిగజార్చేందుకు అనేక పరిణామాలు పొంచిఉన్నాయి.  

► వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం, దీర్ఘకాలిక సప్లై చైన్‌ అంతరాయాలు, చైనా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే తీవ్ర మందగమనంలో కొనసాగే అవకాశాలు, కోవిడ్‌–19 యొక్క కొత్త, మరింత ప్రమాదకరమైన వేరియంట్ల అవకాశాలు, దీనిపై నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలు ప్రపంచాన్ని మరికొంతకాలం సవాళ్ల వలయంలోనే ఉంచే అవకాశం ఉంది.  
 
ఈ అసాధారణమైన అధిక అనిశ్చితి తదుపరి ఆరు నుండి ఎనిమిది నెలల్లో ఇంధప ధరల తీవ్ర ఒడిదుడుకులు, ఫైనాన్షియల్‌ మార్కెట్ల అనిశ్చితికి దారితీసే అవకాశం ఉంది.  

మేనెల్లో మూడీస్‌ జీ–20 ఆర్థిక వ్యవస్థల ఎకానమీ వృద్ధి అంచనాను ఈ ఏడాదికి 3.1 శాతానికి, వచ్చే ఏడాదికి 2.9 శాతానికి తగ్గించింది. అంతక్రితం ఈ అంచనాలు వరుసగా 3.6 శాతం, 3 శాతంగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు