ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చాన్స్‌

15 Aug, 2022 04:15 IST|Sakshi

ప్రపంచ పరిణామాలు కీలకం

రేపు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం డేటా..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు

ముంబై: హోల్‌సేల్‌ ధరల ద్రవ్యోల్బణం డేటా వెల్లడి (మంగళవారం) మినహా దేశీయంగా ట్రేడింగ్‌ ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున.. ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు ప్రపంచ పరిణామాలే కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బుధవారం వెల్లడి కానున్న ఫెడ్‌ రిజర్వ్‌ జూలై పాలసీ సమావేశపు మినిట్స్‌ను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. కంపెనీల జూన్‌ కార్పొరేట్‌ ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరల కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు.

ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఇంధన, మెటల్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారంలో సెన్సెక్స్‌ 1,075 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు లాభపడ్డాయి. ద్రవ్యోల్బణం దిగిరావడం, యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లపై దూకుడు వైఖరిని ప్రదర్శించకపోవచ్చనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి.

‘‘గడిచిన రెండు నెలల్లో సూచీలు 16% ర్యాలీ చేయడంతో మార్కెట్‌ ఓవర్‌బాట్‌ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణకు వీలుంది. సాంకేతికంగా నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో 17,850 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17,350–17,400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు.

ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌: ఫెడ్‌ జూలై పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) ఈనెల 16న (బుధవారం) ప్రకటించనుంది. ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, మాంద్యంతో పాటు వడ్డీ రేట్లపై ఫెడ్‌ పాలసీ కమిటీ వైఖరిని తెలియజేసే ఈ మినిట్స్‌ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలమని నిపుణులు చెబుతున్నారు.  

స్థూల ఆర్థిక గణాంకాలు
స్టాక్‌ మార్కెట్‌ ముందుగా మంగళవారం గతవారం విడుదలైన రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. అదేరోజన జూలై హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. జూన్‌తో పోలిస్తే (15.18 శాతం) ఈ జూలై డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం దిగిరావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.  జూలై మాసపు ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. అలాగే ఆర్‌బీఐ ఆగస్టు 13 తేదీతో ముగిసిన ఫారెక్స్‌ నిల్వల డేటా, ఇదే నెల ఐదో తేదీతో ముగిసిన డిపాజిట్‌– బ్యాంక్‌ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.  

విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు  
విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) ఆగస్టు 1–15 తేదీల మధ్య రూ. 22,452 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అధిక ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది(2021) అక్టోబర్‌లో మొదలైన విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ జూన్‌ నాటికి రూ.2.46 లక్షల కోట్ల నిధులను భారత ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. కాగా.., ఈ జూలైలో రూ. 6295 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జూలై నెల నుంచి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకోవడం, ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న తగు నిర్ణయాలతో విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం ప్రారంభించాయి’’ కోటక్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ రీటైల్‌ హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ అన్నారు.  

ఈ వారంలోనూ ట్రేడింగ్‌ 4 రోజులే..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (నేడు) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఎక్సే్చంజీతో పాటు కమోడిటీ, ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది. మార్కెట్లు తిరిగి మంగళవారం యధావిధిగా ప్రారంభమవుతాయి. 

మరిన్ని వార్తలు