గ్లోబల్‌ డ్రీమ్‌ క్రూయిజ్‌ షిప్‌.. టైటానిక్‌ కంటే దారుణంగా..

21 Jun, 2022 15:20 IST|Sakshi

వందేళ్ల కిందట టైటానిక్‌ షిప్‌ ప్రపంచంలోనే అతి పెద్ద పడవగా రికార్డు సృష్టించింది. కానీ తొలి ప్రయాణం మధ్యలోనే సముద్రంలో ఓ మంచు పర్వతాన్ని ఢీ కొట్టి మునిగిపోయింది. తాజాగా వరల్డ్‌ రికార్డు సాధించే దిశగా మరో భారీ షిప్‌ను నిర్మించడం మొదలెట్టారు. అయితే తొలి ప్రయాణం చేయడానికి ముందే ఈ భారీ నౌక కూడా అప్పుల భారంలో మునిగి నామ రూపల్లేకుండా కనుమరుగు కానుంది.

జర్మనీకి చెందిన వెర్ఫ్‌టెన్‌ సంస్థ గ్లోబల్‌ డ్రీమ్‌ పేరుతో భారీ నౌకలను తయారు చేస్తోంది. ఇందులో గ్లోబల్‌ డ్రీమ్‌ 1 పూర్తిగా సిద్ధం అవగా దాన్ని కంటే పెద్దదిగా గ్లోబల్‌ డ్రీమ్‌ 2 నిర్మాణ పనులు గత కొన్నేళ్లుగా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పడవలో ఏకకాలంలో 9,000ల మంది ప్రయాణించేంత పెద్దగా దీని నిర్మాణం మొదలు పెట్టారు. ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఎక్కడగా వెనక్కి తగ్గలేదు. బ్యాంకుల నుంచి ఎడాపెడా రుణాలు తీసుకున్నారు.

కరోనా కాటు
షిప్‌ నిర్మాణం సగం పూర్తైన తర్వాత ప్రపంచాన్ని కరోనా సంక్షోభం చుట్టేసింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడిన తర్వాత షిప్‌ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే కరోనా తెచ్చిన కష్టాల కారణంగా ప్రస్తుతం జనం సాధారణ జీవితానికి అలవాటుపడ్డా ఇంకా జనాల్లో పూర్తిగా కలిసేందుకు జంకుతున్నారు. దీంతో గ్లోబల్‌ డ్రీమ్‌ వంటి భారీ క్రూయిజ్‌షిప్‌లకు డిమాండ్‌ అస్సలు లేకుండా పోయింది.

దివాళా
కరోనాకి ముందు మేం కొంటామంటే మేం కొంటామంటూ ముందుకు వచ్చిన కంపెనీలు ఆ తర్వాత పత్తాలేకుండా మాయం అయ్యాయి. దీంతో వెర్ఫ్‌టెన్‌ సంస్థ దిక్కు తోచని స్థితిలో పడింది. ఓవైపు నిర్మాణం పూర్తి చేసుకుని అమ్ముడుపోని షిప్‌ మరోవైపు అప్పులిచ్చిన బ్యాంకుల నుంచి ఒత్తిడి. చివరకు ఒత్తిడి తట్టులోకే తాను దివాళా తీస్తున్నట్టు వెర్ఫ్‌టెన్‌ కంపెనీ 2022 జనవరిలో ప్రకటించింది.

అడ్డుగా డ్రీమ్‌లైనర్‌
దివాళా ప్రక్రియ మొదలైన తర్వాత వెర్ఫ్‌టెన్‌కి చెందిన నౌకల తయారీ కర్మాగారాన్ని తైసన్‌క్రూప్‌ అనే నావల్‌ యూనిట్‌ దక్కించుకుంది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం యుద్ధ నౌకలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో వెర్ఫ్‌టెన్‌కి చెందిన షిప్‌యార్డులో యుద్ధ నౌకలు 2024 నుంచి తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గ మార్పులు షిప్‌యార్డులో చేయాల్సి వచ్చింది. అయితే అందుకు అడ్డుగా ఆ షిప్‌యార్డులో అమ్ముడుపోని గ్లోబల్‌ డ్రీమ్‌ 2 క్రూయిజ్‌ షిప్‌ ఉంది.

చివరికి తుక్కే దిక్కు
వెర్ఫ్‌టెన్‌కి అప్పులిచ్చిన బ్యాంకులు గ్లోబల్‌ డ్రీమ్‌ 2ను వేలం పాటలో వేసినా కొనేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. మరోవైపు యుద్ధ నౌకల కోసం ఈ షిప్‌యార్డులో మార్పులు చేయాల్సి వస్తోంది. దీంతో అమ్ముడుపోని ‍భారీ క​‍్రూయిజ్‌ షిప్‌ని కనీసం తుక్కుగా అయినా అమ్మేయాలనే ప్లాన్‌లో ఉన్నాయి బ్యాంకులు. 

కల్లలైన కలలు
వేలకోట్లు పోసి అత్యాధుని సౌకర్యాలతో విలాసవంతంగా తయారైన గ్లోబల్‌ డ్రీమ్‌ 2 చివరకు తన కలల ప్రయాణం ప్రారంభించకుండానే అప్పులు ఊబిలో కూరుకుపోయి తుక్కుగా మారనుంది. 
చదవండి: స్టార్టప్‌లకు గడ్డుకాలం.. ఉద్యోగాలన్నీ హుష్‌ కాకి..

మరిన్ని వార్తలు