అంతర్జాతీయ సవాళ్లతో భారత్‌కు భయం అక్కర్లేదు

7 Sep, 2022 03:25 IST|Sakshi

ఆర్థిక రికవరీకి ఢోకా ఉండకపోవచ్చు

2022–23లో 7.6 శాతం వృద్ధి అంచనా

దేశ రేటింగ్‌పై స్టేబుల్‌ అవుట్‌లుక్‌

మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ నివేదిక  

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న సవాళ్లు, అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరిస్థితుల వంటి అంశాలు భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు విఘాతం కలిగించకపోవచ్చని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ఒక నివేదికలో పేర్కొంది. దేశ రేటింగ్‌ విషయంలో ‘స్టేబుల్‌ అవుట్‌లుక్‌’ను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం ఎకానమీ పురోగమిస్తే, 2022–23లో ఇది 7.6 శాతంగా ఉంటుందని అంచనావేసింది. రానున్న 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.3 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. భారత్‌కు మూడీస్‌  ప్రస్తుతం దిగువస్థాయి ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ రేటింగ్‌ ‘బీఏఏ3’ హోదాను ఇస్తోంది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ‘చెత్త’ రేటింగ్‌కన్నా ఇది ఒక మెట్టు ఎక్కువ.  గత ఏడాది అక్టోబర్‌లో రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్‌’ నుంచి ‘స్టేబుల్‌’క మార్చింది. తాజాగా మూడీస్‌ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

► భారతదేశం క్రెడిట్‌ ప్రొఫైల్‌... పలు స్థాయిల్లో పటిష్టతలను ప్రతిబింబిస్తోంది. పెద్ద, వైవిధ్యభరిత, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ, అధిక వృద్ధి సామర్థ్యం, అంతర్జాతీయ సవాళ్లను తట్టుకోగలిగిన పరిస్థితులు, ప్రభుత్వ రుణానికి స్థిర మైన దేశీయ ఫైనాన్సింగ్‌ బేస్‌ వంటి కీలక అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.  

► రష్యా–ఉక్రెయిన్‌ సైనిక ఘర్షణలుసహా అంతర్జాతీయంగా ఎకానమీకి ఎదురవుతున్న సవాళ్లు– ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో భారత్‌ రికవరీకి (కోవిడ్‌–19 సవాళ్ల నుంచి) విఘాతం కలిగించే అవకాశం లేదని భావిస్తున్నాం.  

► ఎకానమీ, ఫైనాన్షియల్‌ వ్యవస్థల గురించి ప్రస్తుతం కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, అవి తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. ఈ కారణంగానే ఎకానమీకి ‘స్టేబుల్‌ అవుట్‌లుక్‌’ను కొనసాగిస్తున్నాం.

► అధిక క్యాపిటల్‌ (మూలధన ) నిల్వలు, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), బ్యాంకింగ్, నాన్‌–బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) పటిష్టత వంటి విభాగాలకు సంబంధించి సవాళ్లు ఉన్నా... ఆ సమస్యలు ఎకానమీకి కలిగించే నష్టాలు అతి స్వల్పం. ఆయా అంశాలు మహమ్మారి నుండి ఎకానమీ రికవరీని సులభతరం చేస్తున్నాయి.  

► ద్రవ్యలోటు తక్షణ సమస్య ఉన్నప్పటికీ, రానున్న సంవత్సరాలోఈ సవాళ్లు తగ్గుతాయని విశ్వసిస్తున్నాం. దీర్ఘకాలంలో సావరిన్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌ క్షీణించకుండా ఆయా అంశాలు ఎకానమీకి దోహదపడతాయని భావిస్తున్నాం.  

రేటింగ్‌ పెంపుదలే కాదు, తగ్గింపు అవకాశాలూ ఉన్నాయి...
భారత్‌ ఆర్థిక, ఫైనాన్షియల్‌ రంగాల్లో సంస్కరణల అమలు పటిష్టంగా జరిగాలి. ఇది ప్రైవేట్‌ రంగ పెట్టుబడులలో గణనీయమైన, స్థిరమైన పురోగతికి దారితీయాలి.  తద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధి సామర్థ్యం అంచనాలకు మించి పెరిగాలి.  అలాగే ద్రవ్యపరమైన చర్యలు ప్రభుత్వ రుణ భారాలను తగ్గించాలి. రుణ చెల్లింపుల సామర్థ్యం మెరుగుదల క్రెడిట్‌ ప్రొఫైల్‌కు మద్దతు నివ్వాలి. ఈ పరిస్థితుల్లోనే సావరిన్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసే అవకాశం ఉంది. ఇక బలహీన ఆర్థిక పరిస్థితులు తలెత్తినా లేక ఫైనాన్షియల్‌ రంగంలో ఇబ్బందులు తీవ్రమయినా రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం జరుగుతుంది. మేము అంచనావేసినదానికన్నా తక్కువ వృద్ధి రేటు నమోదయితే, అది ప్రభుత్వ రుణ భారాలను పెంచుతుంది. ఆ పరిస్థితి దేశ సార్వభౌమ ద్రవ్య పటిష్టతను మరింత దిగజార్చే వీలుంది. ఆయా అంశాలు నెగటివ్‌ రేటింగ్‌ చర్యకూ దారితీయవచ్చు.  
– మూడీస్‌ ఇన్వెస్టర్స్‌  సర్వీస్‌ 

మరిన్ని వార్తలు