ఎగుమతులపై ప్రపంచ అనిశ్చితి ప్రభావం! డిసెంబర్‌లో వృద్ధిలేకపోగా..

17 Jan, 2023 04:48 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ వస్తు ఎగుమతులపై అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం కనబడుతోంది. 2022 డిసెంబర్‌ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 12.2 శాతం క్షీణతను నమోదుచేసుకున్నట్లు వాణిజ్యశాఖ వెలువరించిన తాజా గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

► 2022 డిసెంబర్‌లో వస్తు ఎగుమతుల విలువ 2021 ఇదే నెలతో పోల్చి 12.2 శాతం తగ్గి, 34.48 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.  
► ఇక వస్తు దిగుమతుల విలువ కూడా 3.5 శాతం తగ్గి 58.24 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  
► వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.76 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.  
► ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతుల విలువ డిసెంబర్‌లో 12 శాతం పడిపోయి 9.08 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
► రత్నాలు ఆభరణాల ఎగుమతులు సైతం 15.2 శాతం పడిపోయి 2.54 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.
► కాఫీ, జీడిపప్పు, ఔషధాలు, కార్పెట్, హస్తకళ లు , తోలు ఉత్పత్తుల ఎగుమతులు కూడా భారీ గా తగ్గాయి.
► పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు కూడా 27 శాతం తగ్గి 4.93 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
► ఇక చమురు దిగుమతులు 6 శాతం పెరిగి 17.5 బిలియన్‌ డాలర్లకు చేరగా, పసిడి దిగుమతులు 75 శాతం క్షీణించి 1.18 బిలియన్‌ డాలర్లకు చేరాయి.
 

తొమ్మిది నెలల పరిస్థితి ఇలా...
ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య దేశ వస్తు ఎగుమతులు 9 శాతం పెరిగి 332.76 బిలియన్‌ డాలర్లుగా నమోదయితే, దిగుమతుల విలువ 24.96 శాతం పెరిగి 551.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 218.94 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2021–22లో దాదాపు 400 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు జరగ్గా, 2022–23లో ఈ స్థాయికి మించి ఎగుమతులు జరగాలన్నది కేంద్రం ధ్యేయం. అయితే అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ఈ లక్ష్యంపై నీలినీడలు అలముకుంటున్నాయి.  గడచిన తొమ్మిది నెలల్లో క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతల విలువ 45.62 శాతం పెరిగి 163.91 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.

ఇక  ఎలక్ట్రానిక్స్‌ రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) వంటి ప్రోత్సాహకాల వల్ల ప్రయోజనం ఒనగూడిందని వాణిజ్యశాఖ కార్యదర్శి సునిల్‌ భరత్‌వాల్‌ పేర్కొన్నారు. ఈ రంగంలో ఎగుమతులు ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య 52 శాతం పెరిగి 17 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. రష్యా నుంచి ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య దిగుమతులు నాలుగురెట్లు పెరిగి 32.88 బిలియన్‌ డాలర్లకు చేరాయి. చైనా నుంచి సైతం దిగుమతులు 12 శాతం పెరిగి 75.87 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఎగుమతులు 35.58 శాతం తగ్గి 11 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్‌ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెథర్లాండ్స్, బంగ్లాదేశ్, సింపూర్‌లు నిలిచాయి.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు