బీపీసీఎల్‌ కొనుగోలు రేసులో దిగ్గజాలు

27 Aug, 2021 02:59 IST|Sakshi

 జట్టుకట్టనున్న గ్లోబల్‌ చమురు కంపెనీలు!

న్యూఢిల్లీ: ఇంధన రంగ దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌) కొనుగోలుకి విదేశీ చమురు కంపెనీలు జట్టుకట్టనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిలోనే వేదాంతా గ్రూప్, అపోలో గ్లోబల్, ఐ స్క్వేర్డ్‌ క్యాపిటల్‌ బిడ్స్‌ను దాఖలు చేశాయి. బీపీసీఎల్‌ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన(ఈవోఐ) సంస్థలతో ఇతర కంపెనీలు సైతం జత కలిసే వీలున్నట్లు ఒక డాక్యుమెంట్‌ పేర్కొంది. తద్వారా కన్సార్షియంగా ఏర్పాటుకావచ్చని తెలుస్తోంది. 2020 నవంబర్‌ 16న బిడ్డింగ్‌కు గడువు ముగిసింది. బీపీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి గల 52.98% వాటా విక్రయానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఆర్‌ఐఎల్, అదానీతోపాటు.. రాయల్‌ డచ్‌ షెల్, బీపీ, ఎగ్జాన్‌ బిడ్డింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. అయితే రష్యన్‌ సంస్థ రాస్‌నెఫ్ట్, మధ్యప్రాచ్యానికి చెందిన పలు చమురు దిగ్గజాలు బీపీసీఎల్‌ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. తద్వారా బిడ్స్‌ దాఖలు చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలతో జత కలవనున్నట్లు తెలుస్తోంది. కన్సార్షియంగా ఏర్పాటయ్యాక బిడ్స్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్‌ లభించవలసి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బీపీసీఎల్‌ కొనుగోలు చేసే సంస్థకు దేశీ చమురు శుద్ధి సామర్థ్యంలో 14% వాటా లభించనుంది. అంతేకాకుండా 23% ఇంధన మార్కెట్‌ వాటానూ దక్కించుకునే వీలుంది.

మరిన్ని వార్తలు