మార్కెట్‌కు బైడెన్‌ జోష్‌

6 Nov, 2020 04:51 IST|Sakshi

ఎనిమిది నెలల గరిష్టానికి సూచీలు

నాలుగోరోజూ లాభాలే... 

అంతర్జాతీయ మార్కెట్ల మద్దతు 

అండగా నిలిచిన మెరుగైన ఆర్థిక గణాంకాలు

12,100 పైన ముగిసిన నిఫ్టీ

సెన్సెక్స్‌ 724 పాయింట్లు జంప్‌

ముంబై: అందరూ అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్ష పోటీలో జో బైడెన్‌ ముందంజలో కొనసాగుతుండడం స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. భారత సేవల రంగం ఏడునెలల తర్వాత మెరుగైన గణాంకాలను ప్రకటించడంతో ఇన్వెస్టర్లకు దేశ ఆర్థిక రికవరీ పట్ల మరింత విశ్వాసం పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడుల పరంపర కొనసాగడం, రూపాయి 40 పైసలు బలపడటం, అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్యూ2 ఫలితాల ప్రకటన పెట్టుబడిదారులకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది.

ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ముగిసేవరకు మార్కెట్లో విస్తృత స్థాయి కొనుగోళ్లు జరిగాయి. ఒక్క రియల్టీ తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. మెటల్‌ షేర్ల పట్ల అధిక ఆసక్తి చూపారు. దీంతో సూచీలకు వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు ఖరారైంది. సెన్సెక్స్‌ 724 పాయింట్లు పెరిగి 41,340 వద్ద, నిఫ్టీ 212 పాయింట్ల లాభంతో 12,120 వద్ద స్థిరపడ్డాయి. ఇరు సూచీలకిది ఎనిమిది నెలల గరిష్ట ముగింపు కావడం విశేషం. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌ 1,727 పాయింట్లు, నిఫ్టీ 478 పాయింట్లను ఆర్జించాయి. తద్వారా ఈ ఏడాదిలో నమోదైన నష్టాలను పూడ్చుకోగలిగాయి. సెన్సెక్స్‌ సూచీలో మొత్తం 30 షేర్లు లాభాల్లో ముగిశాయి.

ఆరుశాతం పెరిగిన ఎస్‌బీఐ షేరు  
ఎస్‌బీఐ షేరు గురువారం బీఎస్‌ఈలో 6 శాతం లాభపడింది. రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరుతో బ్యాంకు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడంతో షేరు రూ.214 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు షేరు కొనుగోళ్లకు తెరతీశారు. ఒకదశలో ఏడుశాతం ఎగిసిన రూ.221 స్థాయికి చేరుకుంది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.218 వద్ద ముగిసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10,397 కోట్లు పెరిగి రూ.1.95 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది.

‘‘ఊహించినట్లుగానే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌ ముందంజ ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌ఓఎంసీ) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేకుండా యథాతథ కొనసాగింపును ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్వార్టర్‌ ఫలితాలు, ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడుల కొనసాగింపు భారత మార్కెట్‌ను లాభాల్లో నడిపిస్తున్నాయి’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగపు అధిపతి వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు.

ఇన్వెస్టర్ల సంపద రూ.2.78 లక్షల కోట్లు అప్‌
సూచీలు భారీ ర్యాలీతో గురు వారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 2.78 లక్షల కోట్లను సంపదను ఆర్జించారు. మార్కెట్‌లో విస్తృత స్థాయిలో కొనుగోళ్లతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ రూ. 162 లక్షల కోట్లకు ఎగసింది.

>
మరిన్ని వార్తలు