Global Tax: కనీస పన్ను వసూలుకు అన్నిదేశాల తీర్మానం.. పాక్‌ సహా ఆ నాలుగు దూరం

9 Oct, 2021 08:58 IST|Sakshi

టెక్‌, సోషల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కలిసికట్టుగా షాక్‌ ఇచ్చేందుకు ప్రపంచం సిద్ధమైంది. గ్లోబల్‌ ట్యాక్స్‌ పేరుతో కనీసం 15 శాతం టాక్స్‌ వసూలు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు 136 దేశాల(భారత్‌ సహా) అంగీకారం తెలిపగా, పాక్‌ సహా నాలుగు దేశాలు మాత్రం ఈ ఒప్పందానికి దూరం జరిగాయి. 

ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (OECD) ఆర్గనైజేషన్‌ సమావేశం శుక్రవారం పారిస్‌లో జరిగింది. తమ తమ దేశాల్లో ఆపరేషన్‌ను నిర్వహించుకునేందుకు గూగుల్‌, ఫేస్‌బుక్‌, నెట్‌ఫ్లిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌.. ఇతరత్రాలకు ఓఈసీడీలోని దేశాలు కనీసం 15 శాతం ట్యాక్స్‌ విధించాలని తీర్మానించాయి. మొత్తం 140 దేశాల్లో శ్రీ లంక, కెన్యా, నైజీరియా, పాకిస్తాన్‌.. మాత్రం ఈ అగ్రిమెంట్‌లో చేరేందుకు విముఖత వ్యక్తం చేశాయి.  అయితే టెక్‌ దిగ్గజాల నుంచి టాక్స్‌ వసూలు నిర్ణయం అమలు అయ్యేది మాత్రం 2023 నుంచే.. 

వీటితో పాటు ఏకపక్ష టాక్స్‌ విధింపు నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు OECD సభ్య దేశాలు ప్రకటించాయి. అక్టోబర్‌ 13న వాషింగ్టన్‌లో జరగబోయే జీ-20 ఫైనాన్స్‌ మినిస్టర్ల సమావేశంలో, ఈ నెలాఖరులో రోమ్‌(ఇటలీ)లో జరగబోయే జీ-20 నేతల సదస్సులో 15 శాతం పన్ను వసూలు నిర్ణయం గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు. 15 మినిమమ్‌ టాక్స్‌ కాగా, గరిష్టంగా ఎంత ఉంటుందనేది మాత్రం ఫిక్స్‌ చేయలేదు. 

ఇక భారత్‌ విషయానికొస్తే.. డిజిటల్‌ అడ్వైర్‌టైజింగ్‌ సర్వీసుల మీద నేరుగా 6 శాతం ట్యాక్స్‌లను విధిస్తూ 2016లో నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో 1,600 కోట్ల రూపాయలు రాగా.. కిందటి ఏడాదితో పోలిస్తే అది రెట్టింపు వసూలు కావడం విశేషం.  ఇక 2020లో నాన్‌ రెసిడెంట్‌ ఈకామర్స్‌ దారులపై 2 శాతం టాక్స్‌ విధించింది భారత్‌. ఇప్పటిదాకా తక్కువ శాతం చెల్లింపుతో సేవల్ని అందిస్తున్న టెక్‌ దిగ్గజాలకు.. కనీస విధింపు నిర్ణయం మింగుడు పడడం లేదు. సెర్చింజిన్‌ గూగుల్‌ అయితే ఇప్పటికే అడ్డగోలుగా ట్యాక్సులు చెల్లించాల్సి వస్తోందని అసంతృప్తిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జీ-20 సమావేశాల్లోపు ఓఈసీడీ దేశాలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాయి. అయితే సమయం లేకపోవడంతో ఈ ప్రయత్నం ఫలించకపోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది.

చదవండి: ఫేస్‌బుక్‌ ద్వారా సంపాదన.. ఎలాగో తెలుసా?

>
మరిన్ని వార్తలు