జీ-మెయిల్ యూజర్లకు అలర్ట్.. ఆ మెయిల్స్‌తో జాగ్రత్త!

31 Aug, 2021 19:48 IST|Sakshi

జీ-మెయిల్ యూజర్లకు హెచ్చరిక. ఇటీవల ఒక కొత్త ఈ-మెయిల్ స్కామ్ బయట పడింది. అమాయక వినియోగదారులు లక్ష్యంగా చేసుకొని ఈ-మెయిల్ కుంభకోణం జరిగినట్లు తెలుస్తుంది. తాజా ఈ-మెయిల్ కుంభకోణం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. యూజర్లను మోసం చేయడానికి నెరగాళ్లు పూర్తిగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దీనికోసం మీరు నకిలీ లింక్ లపై క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మాల్ వేర్ ను మీ ఫోన్లలో ప్రవేశ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ జీ-మెయిల్ స్కామ్ భిన్నమైనది.(చదవండి: నాలుగు టెస్లా మోడల్ కార్లకు భారత్ ఆమోదం..!)

సైబర్ నెరగాళ్లు ఇప్పుడు అమెజాన్,పే పాల్ వంటి పెద్ద కంపెనీల పేరుతో ఈ-మెయిల్స్ పంపుతున్నారు. అందులో ‘‘మీ అమెజాన్‌ ఖాతా నుంచి మీరు యాపిల్ వాచ్‌ / గేమింగ్ ల్యాప్‌టాప్‌ వంటి ఖరీదైన వస్తువులను పేపాల్ ద్వారా కొనుగోలు చేశారు. ఒకవేళ మీరు ఈ కొనుగోలు చేయనట్లయితే, దయచేసి కింద సూచించిన నంబర్‌కి ఫోన్‌ చేయండి’’ అని అందులో ఉంటుంది. నిజానికి ఆ నెంబర్ అమెజాన్/పే పాల్ సంస్థకు చెందినది కాదు. సైబర్ నెరగాళ్లు మీ పాస్ వర్డ్లు, బ్యాంకు వివరాలతో సహా సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. 

వెంటనే ఆ ఈ-మెయిల్స్ తొలగించండి
నకిలీ ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు. అంతేగాక ఫోన్ చేసినప్పుడు యూజర్‌ కంప్యూటర్లలో వైరస్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేలా చేసి అందులోని డేటా దొంగిలిస్తున్నట్లు ఒక సైబర్ భద్రత సంస్థ కాస్పర్‌ స్కై పేర్కొంది. ఈ కొత్త ఈ-మెయిల్ కుంభకోణానికి 'విషింగ్' అని పేరు పెట్టారు. జీ-మెయిల్ కస్టమర్లకు ప్రతి రోజు ఈమెయిల్స్ పంపిస్తున్నట్లు కాస్పర్‌ స్కైలోని ఒక బృందం చెప్పింది. అందుకే యూజర్స్ ఇలాంటి ఈ-మెయిల్స్‌ వస్తే ఓపెన్ చేయకుండా ముందు జాగ్రత్తగా అమెజాన్‌ లేదా పేపాల్ ఖాతాలను ఓపెన్ చేసి వాటి నుంచి లావాదేవీ జరిగిందా లేదా అనేది చూసుకోవాలని సూచించారు. ఒకవేళ సదరు మెయిల్ మోసపూరితమని అనుమానం కలిగితే వెంటనే డిలీట్ చేయాలని భద్రత నిపుణులు సూచిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు