జీఎంఎం ఫాడ్లర్‌- స్ట్రైడ్స్‌ ఫార్మా.. హైజంప్‌

21 Aug, 2020 14:05 IST|Sakshi

మాతృ సంస్థలో వాటా కొనుగోలుకి రెడీ

8 శాతం దూసుకెళ్లిన జీఎంఎం ఫాడ్లర్‌

పీబీసీ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ సై

9 శాతం జంప్‌చేసిన స్ట్రైడ్స్‌ ఫార్మాసైన్స్‌ 

ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 293 పాయింట్లు, నిఫ్టీ 87 పాయింట్లు చొప్పున ఎగశాయి. కాగా.. మాతృ సంస్థలో వాటా కొనుగోలుకి సిద్ధపడుతున్నట్లు వెల్లడించడంతో ఇంజినీరింగ్‌ కంపెనీ జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క లివర్‌ వ్యాధి(పీబీసీ) చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించినట్లు పేర్కొనడంతో హెల్త్‌కేర్‌ సంస్థ స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి.

జీఎంఎం ఫాడ్లర్‌
మాతృ సంస్థ జీఎంఎం గ్రూప్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు జీఎంఎం ఫాడ్లర్‌ తాజాగా పేర్కొంది. పీఈ సంస్థ డాయిష్‌ బిటైలిగంగ్‌ నుంచి 54 శాతం వాటాను 27.4 మిలియన్‌ డాలర్ల(రూ. 205 కోట్లు)కు సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు కుదిరిన ఒప్పందం ప్రకారం పటేల్‌ కుటుంబం మరో 26 శాతం వాటాను కొనుగోలు చేస్తుందని వెల్లడించింంది. మిగిలిన 20 శాతం వాటా పీఈ సంస్థ వద్ద కొనసాగుతుందని తెలియజేసింది. నవంబర్‌కల్లా లావాదేవీలు పూర్తికావచ్చని తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత జీఎంఎం ఫాడ్లర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం దూసుకెళ్లి రూ. 6,350ను తాకింది. ప్రస్తుతం 4.25 శాతం ఎగసి రూ. 6114 వద్ద ట్రేడవుతోంది.

స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్
లివర్‌లో తలెత్తే ప్రైమరీ బిల్లరీ సిరోసిస్‌(బీపీసీ) వ్యాధి చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ తాజాగా వెల్లడించింది. ఈ ఔషధాన్ని ఉర్సోడియాల్‌ బ్రాండుతో 250 ఎంజీ, 500 ఎంజీ డోసేజీలలో ట్యాబ్లెట్ల రూపంలో విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఇవి అలెర్గాన్‌ తయారీ ఉర్సో ఫోర్ట్‌ ఔషధానికి జనరిక్‌ వెర్షన్‌గా కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో స్ట్రైడ్స్‌ ఫార్మా షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 9 శాతం జంప్‌చేసి రూ. 618కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.5 శాతం లాభంతో రూ. 610 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు