హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో యూడీఎఫ్‌ పెంచొద్దు

17 Aug, 2021 03:09 IST|Sakshi

ఏఈఆర్‌ఏకి ఎయిర్‌లైన్స్‌ సమాఖ్య విజ్ఞప్తి

హైదరాబాద్‌: రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (యూడీఎఫ్‌) పెంచేందుకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) చేసిన ప్రతిపాదనలపై దేశీ విమానయాన సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోవిడ్‌–19పరమైన ప్రతికూల పరిణామాలతో ఎయిర్‌లైన్స్‌ పెను సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో యూడీఎఫ్‌ పెంచడం సరికాదని, పెంపు ప్రతిపాదన అమలును వాయిదా వేయాలని ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్‌ఏ)కి విజ్ఞప్తి చేసింది. థర్డ్‌ కంట్రోల్‌ పీరియడ్‌గా వ్యవహరిస్తున్న 2021 ఏప్రిల్‌–2026 మార్చి మధ్య కాలానికి టారిఫ్‌లను సవరించేందుకు అనుమతించాలంటూ ఏఈఆర్‌ఏకి జీహెచ్‌ఐఏఎల్‌ ప్రతిపాదనలు సమర్పించింది. దేశీయంగా ప్రయాణించే వారికి యూడీఎఫ్‌ను ప్రస్తుతమున్న రూ. 281 నుంచి ఏకంగా రూ. 608కి (116% అధికం), అంతర్జాతీయ రూట్ల ప్రయాణికులకు ప్రస్తుత రూ. 393 నుంచి రూ. 1300కి (231 శాతం) పెంపునకు అనుమతించాలని వీటిల్లో కోరింది.

మరిన్ని వార్తలు